పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు.. | Investment Strategies To Learn Before Trading | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి ఐడియా ఒక్కటే సరిపోదు..

Published Mon, Jun 28 2021 3:04 AM | Last Updated on Mon, Jun 28 2021 3:10 AM

Variation of Idea Investors, Traditional Investors - Sakshi

పల్లం వెంటే నీరు ప్రవహించినట్టు.. పెట్టుబడులు కూడా రాబడులనే వెతుక్కుంటూ వెళుతుంటాయి. ఆలోచన వస్తే ఆలస్యం చేయొద్దు.. వెంటనే ఇన్వెస్ట్‌ చేయడమే.. దీన్నే ఆలోచనాధారిత పెట్టుబడిగా (ఐడియా ఇన్వెస్టింగ్‌) చెబుతుంటారు. సంప్రదాయ ఇన్వెస్టర్లు, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న వారు కంపెనీల గురించి పూర్తిగా అధ్యయనం చేయనిదే పెట్టుబడులు పెట్టరు. కానీ, ఒక ఆలోచనకు అనుబంధంగా పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే వారిని ఐడియా ఇన్వెస్టర్లుగా పిలుస్తారు. మల్టీబ్యాగర్‌ (పెట్టుబడిని) అని భావిస్తే చాలు వెంటనే ఆ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు.

పెట్టుబడులకు ముందే కంపెనీ ఆర్థిక మూలాల దగ్గర్నుంచి.. యాజమాన్యం, పోటీతత్వం, ఉత్పత్తులు/సేవలకు ఉన్న మార్కెట్‌ ఆదరణ ఇలా ఎన్నో అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసే వారికి రాబడులు కచ్చితంగా వస్తుంటాయి. కానీ, బుల్‌ మార్కెట్లో గొర్రెదాటు విధానంలో ఇన్వెస్ట్‌ చేసేవారికీ రాబడులు వస్తుంటాయి. మార్కెట్‌ గమనం మార్చుకుంటే అప్పుడు తెలిసొస్తుంది ఎక్కడ తప్పు జరిగిందో అని. ఐడియా ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం దీనికి పూర్తి భిన్నం. ఇందులోనూ రిస్క్‌లు లేకపోలేదు. వాటిపై చర్చించే కథనమే ఇది..

కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను ప్రకటించడం తెలిసిందే. ఐడియా ఇన్వెస్టర్లు ఈ ప్యాకేజీలతో లాభపడే స్టాక్స్‌లో వెంటనే ఇన్వెస్ట్‌ చేస్తారు. డిజిటల్‌ ఇండియాపై కేంద్రం ఎక్కువగా దృష్టి పెట్టడంతో.. ఈ విధానం నుంచి లాభపడే స్టాక్స్‌ను ఎంచుకుంటారు. బీమా, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచితే ఆయా రంగంలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. మౌలికరంగంపై రానున్న ఐదేళ్లలో కేంద్ర సర్కారు భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేస్తుండడంతో ఇన్‌ఫ్రా స్టాక్స్‌ను ఎంపిక చేసుకుంటారు. ఇలా ఉంటుంది ఐడియా ఇన్వెస్టర్ల పెట్టుబడుల విధానం.    

అధ్యయనం లేకపోతే..?
ఒక ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చాయంటే.. ఇతరులతో పోలిస్తే ఆ కంపెనీల గురించి ముందుగానే మెరుగైన అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టడం వల్లేనన్నది నిపుణుల అభిప్రాయం. ఫలానా రంగానికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని.. మార్కెట్‌ గుర్తించని సమయంలో మేలి కంపెనీలను గుర్తించే వారు విజేతలుగా రాణిస్తుంటారు. కానీ, ఒక ఆలోచన ప్రకారం ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లే ఐడియా ఇన్వెస్టర్లు మాత్రం కంపెనీల గురించి ఆయా రంగాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడం తక్కువే. దీనికి బదులు సానుకూలతలను చూసి వెంటనే ఆయా స్టాక్స్‌ను సొంతం చేసుకునే విధంగా ఉంటుంది వారి ధోరణి.

ఎందుకంటే ‘ఆలస్యం అమృతం విషం’ అనే సూత్రాన్ని వారు అనుసరిస్తుంటారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఒక రంగానికి ప్రకటించిన తర్వాత.. ఆలస్యం చేస్తే ఆయా స్టాక్స్‌ ర్యాలీతో చేతికి అందకుండా పోతాయన్న భయం వారిలో ఉంటుంది. దీంతో ఫలానా అవకాశాన్ని కోల్పోకూడదన్న ధోరణితో అధ్యయనం కంటే వేగంగా ఇన్వెస్ట్‌ చేసేందుకే ఆసక్తి చూపిస్తుంటారు.  కరోనా రెండో విడతలో ఒక దశలో ఆక్సిజన్‌కు దేశంలో తీవ్ర కొరత నెలకొనడాన్ని చూశాం. దీంతో రాబడుల కోసం ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే కంపెనీల వెంట పడ్డారు ఐడియా ఇన్వెస్టర్లు. ఇందుకు నిదర్శనం బోంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌. ఐడియా ఇన్వెస్టర్లనే థీమ్యాటిక్‌ ఇన్వెస్టర్లుగానూ పరిగణిస్తుంటారు. అంటే అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పెట్టుబడులు చేస్తుంటారు.

పేరులోనే ఆక్సిజన్‌ ఉండడంతో బోంబే ఆక్సిజన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ స్టాక్‌ ఏకంగా 150 శాతం ర్యాలీ చేసింది. ఈ కంపెనీ చాలా చిన్నది. రూ.200 కోట్ల మార్కెట్‌ విలువ కలిగినది. ఈ స్టాక్‌ 52 వారాల కనిష్ట ధర రూ.8511 కాగా, గరిష్ట ధర రూ.25,500 వరకు (ఏప్రిల్‌ 20న) పరుగులు తీసింది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య వరకు రూ.10,000 నుంచి రూ.25,000కు ర్యాలీ చేయడం గమనార్హం. కంపెనీ ఆక్సిజన్‌ తయారీలో లేదన్న విషయం బయటకు రావడంతో అమ్మకాల కారణంగా  స్టాక్‌ రూ.14,550కు పడిపోయింది. వాస్తవానికి ఈ కంపెనీ గతంలో పారిశ్రామిక గ్యాస్‌ల తయారీలో ఉంది. 2019 ఆగస్ట్‌లో ఆ వ్యాపారం నుంచి తప్పుకుంది.

పక్కదారి..
ఒక్క బాంబే ఆక్సిజన్‌ అనే కాదు.. ఐడియా ఇన్వెస్టింగ్, థీమ్యాటిక్‌ ఇన్వెస్టింగ్‌ దారిలో తప్పుదోవ పట్టించేవి ఎన్నో ఉంటాయి. మార్కెట్‌ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు సీజన్‌వారీగా వ్యాపార ప్రణాళికలతో ముందుకు వెళ్లే కంపెనీలు చాలానే ఉన్నాయి. ఆకర్షణీయంగా అనిపిస్తే, నిధుల సమీకరణ ప్రతిపాదన తీసుకొచ్చి కొత్త వ్యాపారం దిశగా దూకుడుగా వెళ్లేవీ ఉన్నాయి. డాట్‌కామ్‌ బూమ్‌ సమయంలో సైబర్‌ పేరుతో.. 2007–08 ఇన్‌ఫ్రా బూమ్‌లో పేరులో ఇన్‌ఫ్రా తగిలించుకుని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టినవి కూడా ఉన్నాయి. ఈ కామర్స్‌ బూమ్‌ చూసి లాజిస్టిక్స్‌ (రవాణా సేవలు)లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అడుగుపెట్టినవీ ఉన్నాయి.

ఈ తరహా కంపెనీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నది నిపుణుల సూచన. ఎందుకంటే ఎంపిక చేసుకున్న వ్యాపారంలో సామర్థ్యాన్ని నిరూపించుకుని.. మార్కెట్‌ లీడర్‌గా అవతరించిన తర్వాత.. వ్యాపార విస్తరణ కోణంలో నూతన అవకాశాల వైపు చూసే కంపెనీలు రాణించేందుకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. కానీ, ఒక వ్యాపారంలో రాణించలేక.. మార్కెట్‌ ధోరణికి తగినట్టు వ్యవహరించే కంపెనీల నుంచి రాబడులను ఆశించడం నష్టాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఇందుకు వక్రంగీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీయే ఉదాహరణ. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ ఎన్నో నూతన అవతారాలతో వాటాదారులకు నష్టాలు మిగిల్చింది.

ఆధార్‌ యూఐడీ ప్రాజెక్ట్‌కు 2010లో ఫ్రాంచైజీగా వ్యవహరించిన ఈ సంస్థ.. అనుబంధ కంపెనీలతో ఈకామర్స్‌ సంస్థలకు లాజిస్టిక్స్‌ సేవలు, బంగారం రిటైలింగ్‌ ఇలా కొత్త వ్యాపారాలను చేపట్టింది. అంతటితోనూ ఆగలేదు. దేశవ్యాప్తంగా వైట్‌లేబుల్‌ ఏటీఎంల ఏర్పాటులోకీ ప్రవేశించింది. వైట్‌ లేబుల్‌ అంటే అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం స్వతంత్రంగా ఏర్పాటు చేసేవి. ఈ కంపెనీ నూతన ఎత్తుగడలు థీమ్యాటిక్‌/ ఐడియా ఇన్వెస్టర్లకు తెగనచ్చేసింది. దీంతో 2015 సెప్టెంబర్‌లో రూ.54 వద్దనున్న షేరు ధర 2018 జనవరి 25న రూ.505 గరిష్టాలకు చేరింది. ఆ తర్వాత కంపెనీ నిర్వహణ ప్రమాణాల్లో లోపాలు వెలుగు చూశాయి. ఆడిటర్‌ రాజీనామా, సెబీ జరిమానాలు.. ఈ పరిణామాలతో స్టాక్‌ ధర 2018 నవంబర్‌లో రూ.32కు పడిపోయింది. ఇప్పటికీ ఈ స్టాక్‌ ధర రూ.46 దరిదాపుల్లోనే ఉంది.  
...
అందుకే మూక ధోరణి ఇక్కడ పనికిరాదు. మధ్యలోనే కాడి వదిలేసేవాటికి దూరంగా ఉంటేనే ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ. ఇందుకోసం పెట్టుబడులు పెట్టే ముందుగా కంపెనీ ఆర్థిక అంశాలను పూర్తిగా అధ్యయనం చేయాలి. వార్షిక రిపోర్ట్‌లను, యాజమాన్యం భవిష్యత్తుకు సంబంధించి చేసే వ్యాఖ్యలు, ప్రణాళికలను పరిశీలించాలి. ఉన్న వ్యాపారాన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లకుండా కొత్త వ్యాపారాల్లోకి ఎప్పటికప్పుడు ప్రవేశించే కంపెనీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన వ్యాపారాలను ఏర్పాటు చేసి, వాటిని విజయం దిశగా నడిపించిన యాజమాన్యాలు అయితే ఫర్వాలేదు. సరైన ట్రాక్‌రికార్డు లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా వ్యాపారాలను సృష్టించే వాటి విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి.  

నిర్వహణ అంత సులువుకాదు..
నిర్వహణ సామర్థ్యం ఉందా, లేదా? అని చూడకుండా పెట్టుబడులకు ఆయా కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల లాభాలు వస్తాయన్న హామీ ఉండదు. ఏ కొత్త వ్యాపారం అయినా దాన్ని విజయవంతం చేసే సామర్థ్యాలు యాజమాన్యాలకు ఉన్నాయా? అనేది ముఖ్యంగా చూడాలి. ఎడ్యుకాంప్‌ సొల్యూషన్స్‌ కంపెనీని ఇక్కడ ఉదాహరణగా తీసుకోవాలి. 2008–2010 మధ్య ఐడియా ఇన్వెస్టర్లకు ఈ స్టాక్‌ ఎంతో ఆకర్షణంగా ఉండేది. 2006లో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన ఈ కంపెనీ షేరు.. బ్రహ్మాండమైన ర్యాలీతో ఇన్వెస్టర్ల మతిపోగొట్టింది. మనదేశంలో దాదాపు స్కూళ్లన్నీ బ్లాక్‌ బోర్డులపై బోధనతోనే నడుస్తుండేవి. సరిగ్గా వీటి స్థానంలో డిజిటల్‌ బోధన అనే ఐడియాను ఈ సంస్థ వ్యాపార మంత్రంగా చేసుకుంది.

దేశవ్యాప్తంగా స్కూళ్లకు మార్కెటింగ్‌ చేయడం మొదలుపెట్టింది. లిస్ట్‌ అయిన మూడేళ్లలోనే ఆదాయంలో నూరు శాతం వృద్ధిని చూపించింది. 48 శాతం నిర్వహణ లాభాలను ప్రకటించింది. 2,500 స్కూళ్లలో స్మార్ట్‌క్లాస్‌ సొల్యూషన్లను ఏర్పాటు చేసింది. 15,000 స్కూళ్లకు విస్తరించి, రూ.1,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దూకుడుగా అయితే వెళ్లింది కానీ, ప్రణాళిక లోపించింది. స్కూళ్లల్లో డిజిటల్‌ బోధన పరికరాలను ఏర్పాటు చేస్తేనే ఆదాయం రాదు కదా.. ఆ విధానాన్ని వ్యాపార పరంగా విజయవంతంగా మార్చుకోవడంలో విఫలమైంది. స్కూళ్ల సంఖ్యను పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. దీంతో చాలా స్కూళ్లు ఎడ్యుకాంప్‌కు చెల్లింపులు కూడా చేయలేకపోయాయి.

స్కూళ్ల నుంచి కంపెనీకి రావాల్సిన చెల్లింపులు పేరుకుపోవడంతో.. తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయలేక ఎడ్యుకాంప్‌ చేతులెత్తేసింది. 2016లో బ్యాంకుల నిరర్థక ఆస్తిగా ఈ కంపెనీ మారిపోయింది. ఒకప్పుడు రూ.1,000 పలికిన షేరు ఇప్పుడు రూ.3 దగ్గర్లో ట్రేడవుతోంది.  అందుకే కంపెనీ వ్యాపార ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండే సరిపోదు. సమర్థవంతంగా నిర్వహించి, విజయాలను అందుకోవడం కొన్నింటికే సాధ్యపడుతుంది. ఆ కొన్నింటిని గుర్తించగలిగితే రాబడులు బుట్టనిండా వేసుకోవచ్చు. అలా అని అన్ని కంపెనీలూ బోంబే ఆక్సిజన్, వక్రంగీ సాఫ్ట్‌వేర్, ఎడ్యుకాంప్‌ అవుతాయని కూడా అనుకోవద్దు.

ముఖ్యంగా కరోనా రాకతో ఫార్మా, ఆస్పత్రుల కంపెనీలకు భారీ లాభాలు వస్తాయన్న ఐడియాతో ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు గడిచిన ఏడాది కాలంలో గణనీయమైన రాబడులను సొంతం చేసుకున్నారు. అయితే, ఫార్మా రంగంలో మన దేశం దిగ్గజంగా ఉన్న విషయం తెలిసిందే, ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ ఎప్పుడో కొలువుదీరి వ్యాపారంలో కాకలు తీరి ఉన్నాయి. డయాగ్నోస్టిక్స్, ఆస్పత్రుల్లోనూ మంచి కంపెనీలున్నాయి. దీంతో ఈ ఐడియా మంచి లాభాలనే కురిపించింది. కరోనా రాక ముందు కూడా ఇవన్నీ వ్యాపారంలో మంచి పనితీరు చూపిస్తున్నాయి. కరోనా కారణంగా పెరిగిన డిమాండ్‌తో మరింత లాభపడ్డాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా వచ్చే అవకాశాల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే ఐడియా ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడులను వాటికే కేటాయించకుండా.. 10–20 శాతానికే పరిమితం చేసుకోవడం, పూర్తి అధ్యయనం తర్వాతే అడుగులు వేయడం వల్ల రాబడులు అటుంచితే పెట్టుబడులకు నష్టం కలగకుండా కాపాడుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement