న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు వరుసగా అయిదో నెలా పెరిగాయి. జులై ఆఖరు నాటికి రూ. 1.23 లక్షల కోట్లకు చేరాయి. తద్వారా ఆరేళ్ల గరిష్ట స్థాయికి ఎగిశాయి. 2017 డిసెంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. అప్పట్లో పీ–నోట్స్ ద్వారా పెట్టుబడులు రూ. 1.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఈ డేటా ప్రకారం జూన్ ఆఖరు నాటికి పీ–నోట్స్ పెట్టుబడులు రూ. 1,13,291 కోట్లుగా ఉండగా జూలై ఆఖరు నాటికి రూ. 1,22,805 కోట్లకు చేరాయి. ఇందులో రూ. 1.13 లక్షల కోట్లు ఈక్విటీల్లో, రూ. 9,531 కోట్ల మొత్తం డెట్ సాధనాల్లో, రూ. 299 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీస్‌లోను ఉన్నాయి. భారత్‌లో నేరుగా నమోదు చేసుకోకుండా ఇక్కడి స్టాక్ మార్కె ట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీ–నోట్స్ ఉపయోగపడతాయి. రిజిస్టర్ చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు (ఎఫ్‌పీఐ) వీటిని జారీ చేస్తాయి. సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల ధోరణులకు అనుగుణంగా పీ–నోట్స్ వృద్ధి మారుతుంటుంది.
ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతీయ ఎకానమీ స్థిరంగా ఉండటమనేది పీ–నోట్స్ పెట్టుబడులు పెరుగుదలకు ఒకానొక కారణమని మార్కెట్ వర్గాలు తెలి పాయి. అలాగే, చైనా ఎకానమీ మందగించడం వల్ల కూడా ఇన్వెస్టర్లు భారత్ వైపు చూస్తున్నారని వివరించాయి.
Comments
Please login to add a commentAdd a comment