ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
- అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు.
- ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు.
- హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం.
- ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది.
- మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది.
- 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment