
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు ఈ ఏడాది గణనీయ సంఖ్యలో వచ్చాయి. 139 సంస్థలు రూ.3,540 కోట్లు సమీకరించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఇవి బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లపై లిస్ట్ అయ్యాయి. ఫ్యామిలీ ఆఫీసులు, అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐలు) ఆసక్తి చూపిస్తుండడం, తగినంత లిక్విడిటీ ఉండడం, మార్కెట్ అనుకూల పరిస్థితులు ఇవన్నీ ఎస్‌ఎంఈల ఐపీవో ప్రణాళికలను విజయవంతం చేశాయని చెప్పుకోవచ్చు.
ఇవన్నీ కూడా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమోటివ్ విడిభాగాలు, ఫార్మా, ఇన్‌ఫ్రా, అడ్వర్టయిజింగ్, హాస్పిటాలిటీ రంగాల నుంచి ఉన్నాయి. 2022లో 109 ఎస్‌ఎంఈలు రూ.1,875 కోట్లు మాత్రమే వసూలు చేశాయి. రానున్న కాలంలోనూ ఎస్‌ఎంఈల నిధుల సమీకరణకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొన్ని రంగాల్లో వృద్ధికి మెరుగైన పరిస్థితులు ఉండడం, మార్కెట్లో లిక్విడిటీ, ఇన్వెస్టర్ సెంటిమెంట్ రానున్న రోజుల్లో ఎస్‌ఎంఈ ఐపీవోలను ముందుకు నడిపిస్తాయని అరిహాంట్ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ హెడ్ అభిషేక్ జైన్ పేర్కొన్నారు.
మరో రెండు ఐపీవోలు
ఈ వారంలో ప్యారాగాన్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్, ఆన్ డోర్ కాన్సెప్ట్స్ అనే రెండు ఎస్‌ఎంఈ ఐపీవోలు నిధుల సమీకరణకు రానున్నాయి. ఈ ఏడాది ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ, మూలధన అవసరాలు, రుణ భారం తగ్గించుకోవడానికి ఎస్‌ఎంఈలు ఉపయోగించనున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా సెప్టెంబర్ నెలలో 37 ఎస్‌ఎంఈ ఐపీవోలు నిధులు సమీకరణ చేశాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)కు కూడా మంచి డిమాండ్ ఉంది. కొంత కాలం క్రితం ఈ చిన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన బడా ఇన్వెస్టర్లు, పీఈ సంస్థలు వాటిల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు. ఈ కోణంలోనూ ఐపీవోకు కొన్ని ఎస్‌ఎంఈలు వస్తున్నాయి. మార్కెట్లో లిక్విడిటీ మెరుగ్గా ఉండడం, వ్యాపారాలకు మెరుగైన వృద్ధి అవకాశాలు ఇవన్నీ నిధుల సమీకరణకు కలిసొస్తున్నట్టు క్లైంట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment