ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియోసినిమా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. క్రికెట్ మ్యాచ్‌ల వంటి లైవ్ ప్రోగ్రామింగ్‌ను ఉచితంగా అందిస్తున్న కంపెనీ కేవలం రోజూ రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలను అందించనుంది.
రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ యాజమాన్యంలోని ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ జియోసినిమా దాని సబ్‌స్క్రిప్షన్‌ను మూడింట రెండు వంతులు తగ్గించి నెలకు రూ.29కి చేర్చింది. ఈ ప్లాన్‌లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌తోపాటు 4K క్వాలిటీ, విదేశీ సినిమాలు, టీవీ సిరీస్‌లు, పిల్లల ప్రోగ్రామ్‌లను ఐదు భాషల్లో అందిస్తున్నట్లు వయాకామ్18 డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తెలిపారు. ‘నాలుగు డివైజ్‌ల్లో ఏకకాలంలో జియోసినిమాను యాక్సెస్ చేసేలా నెలకు రూ.89తో ఫ్యామిలీప్యాక్‌ను తీసుకొచ్చాం. జియోసినిమా చూడడం కుటుంబ సభ్యులకు అలవాటుగా మార్చడానికి సరసమైన ధరలతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచాం. పిల్లల కంటెంట్‌తో కూడిన అతిపెద్ద లైబ్రరీ కూడా ఇందులో ఉంది’ అని మణి అన్నారు.
ఇదీ చదవండి: నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్
1 బిలియన్(100 కోట్లు) ప్లస్ వీక్షకుల కోసం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, సోనీ గ్రూప్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు పోటీ పడుతున్నాయి. తాజాగా జియో సినిమా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మీడియా సంస్థల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ విలీనానికి రిలయన్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియోసినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఉచితంగా ప్రసారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment