న్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య మాధవ్‌రావు సింధియా గురువారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సింధియా మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖను చేపట్టిన మూడో మంత్రి కావడం గమనించాలి. ఢిల్లీలోని ఉద్యోగభవన్‌లో ఉక్కు శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన తన టేబుల్‌పై వినాయకుడి విగ్రహం ఉంచి, ఈ కార్యక్రమం చేపట్టారు. ‘‘ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు స్టీల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను.
శ్రేయోభిలాషుల దీవెనలతో నూతన బాధ్యతలను సాధ్యమైన మేర మెరుగ్గా నిర్వహిస్తాను. ఆర్‌సీపీ సింగ్ నుంచి బాధ్యతలు స్వీకరించాను. అగ్ర నాయకత్వం ఇచ్చిన ఈ బాధ్యతలను పూర్తి సామర్థ్యాలతో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిర్వహిస్తాను’’అంటూ సింధియా రెండు వేర్వేరు ట్వీట్లు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉక్కు శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశాలు నిర్వహించారు. అలాగే, ఉక్కు రంగానికి సంబంధించి అన్ని ప్రభుత్వరంగ సంస్థల అధిపతులతోనూ సమావేశమయ్యారు. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఉక్కు శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్సీపీ సింగ్ రాజీనామా చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment