ఆటుపోట్ల మధ్య మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు పుంజుకుని 40,256 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు బలపడి 11,801 వద్ద కదులుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఏంజెల్ బ్రోకింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
కొటక్ మహీంద్రా బ్యాంంక్
ఈ ఆర్థిక సంవత‍్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. దీంతో వరుసగా రెండో రోజు కొటక్ బ్యాంక్ షేరు జోరు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1,559 సమీపంలో ట్రేడవుతోంది.
ఏంజెల్ బ్రోకింగ్
ఈ ఆర్థిక సంవత‍్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఏంజెల్ బ్రోకింగ్ నికర లాభం రూ. 74 కోట్లకు జంప్ చేసింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక లాభంకాగా.. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో రూ. 48 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం 29 శాతం పెరిగి రూ. 318 కోట్లను తాకింది. రోజువారీ సగటు టర్నోవర్ 107 శాతం పుంజుకుని రూ. 1281 బిలియన్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిట్ మార్జిన్లు 6.3 శాతం బలపడి 49 శాతాన్ని అధిగమించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 290 సమీపంలో ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment