ఏఐని వాడాడు.. ఉద్యోగం ఊడింది! | Sakshi
Sakshi News home page

ఏఐని వాడాడు.. ఉద్యోగం ఊడింది!

Published Mon, Nov 20 2023 11:53 AM

Lawyer Zachariah Crabill Lost His Job After Using Chatgpt Create Fake Cases - Sakshi

కృతిమ మేధ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని నమ్ముకుని ఓ యువ న్యాయవాది తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ప్రముఖ లా సంస‍్థలో పనిచేస్తున్న సదరు లాయర్‌ నిర్ణీత గడువులోగా ఇచ్చిన పనిని పూర్తి చేయాలని బాస్‌ హుకుం జారీ చేశాడు. సమయం గడిచి పోతుంది. పని కావడం లేదు. పైగా ఒత్తిడి. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ న్యాయవాది చాట్‌జీపీటీని వినియోగించి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 

మనిషి తెలివితేటలకు, న్యాయ నిర్ణయ ప్రక్రియలో మానవ జోక్యానికి కృత్రిమ మేధస్సు ఓ ప్రత్యామ్నాయం కాదని మరోసారి స్పష్టమైంది. అమెరికా కొలరాడో కేంద్రంగా న్యాయ సంబంధిత సర్వీసుల్ని అందించే ‘బేకర్ లా గ్రూప్’లో జకారియా క్రాబిల్ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో తన ఆఫీస్‌ పని నిమిత్తం చాట్‌జీపీటీని వినియోగించడం జకారియాకు పరిపాటిగా మారింది. 

అయితే ఈ ఏడాది మే నెలలో కాబ్రిల్‌కు కస్టమర్ల కేసుల్ని కులంకషంగా రీసెర్చ్‌ చేసి.. గతంలో ఇదే తరహా కేసుల్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా డ్రాఫ్ట్‌ని తయారు చేయాలి. వాటిని కొలరాడో కోర్టులో సమర్పించాల్సి ఉందని, వెంటనే ఆ పనుల్ని పూర్తి చేయాలని బాస్‌ ఆదేశించాడు. పని భారాన్ని తగ్గించుకుంటూ.. కస్టమర్ల కేసుల్ని రీసెర్చ్‌ చేసి డ్రాఫ్ట్‌ను తయారు చేసేలా కాబ్రిల్‌ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు.  

కాబ్రిల్‌ అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని ఆధారంగా తీసుకుని కొన్ని కేసులకు సంబంధించి ప్రత్యేక డ్రాఫ్ట్‌ను తయారు చేశాడు. అనంతరం తన బాస్‌తో కలిసి.. తయారు చేసిన ఫైల్స్‌ని కొలరాడో కోర్టుకు సమర్పించాడు. 

కాబ్రిల్‌ కోర్టుకు సమర్పించిన కేసు ఫైల్స్‌ను చాట్‌జీపీటీని వినియోగించి తయారు చేసినట్లు తేలింది. అంతేకాదు డ్రాఫ్ట్‌లో పలు కీలక అంశాల్ని గతంలో జరిగిన కేసుల్ని ఉదహరిస్తూ చాట్‌జీపీటీని ప్రస్తుత కేసులకు అనుగుణంగా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు దొర్లాయి. ఆ సమాధానాలు సరైనవి కాదని తెలిసి కూడా కేసుల్లోని డ్రాఫ్ట్‌లను తయారు చేశాడు. ఇదే అంశాన్ని న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.  


తాను ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, న్యాయవాదుల సామర్థ్యాన్ని పెంచడానికి ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని క్రాబిల్ విశ్వసిస్తున్నాడు. చట్టపరమైన సేవల కోసం ఏఐని ఉపయోగించి సొంత కంపెనీని కూడా ప్రారంభించాడు.

Advertisement
Advertisement