బాహుబలి తర్వాత తెలుగు తెర నుంచి వస్తోన్న మరో భారీ బడ్జెట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా బడ్జెట్‌కి తగ్గట్టుగా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కారు అనుమతులు ఇచ్చింది. అంతకు ముందే తెలంగాణలో కూడా జీవో జారీ అయ్యింది. వీటికి తోడు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ని ఖుషి చేసే మరో వార్త వెలుగు చూసింది.
కరోనా సంక్షోభం మొదలైన తర్వాత సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. ఇదే సమయంలో ఓటీటీ వీక్షకుల సంఖ్య పెరిగారు. లాక్‌డౌన్ ఎత్తేసినా సీ సెంటర్‌లో సింగిల్ స్క్రీన్ నుంచి మెట్రోలో మల్టీప్లెక్సుల వరకు ఖాళీ సీట్లే ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం.
థియేటర్ల దగ్గర సందడేది?
సౌత్‌లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలకు ఓపెనింగ్స్ వరకు బాగానే ఉన్నా.. తర్వాత థియేటర్‌కి వస్తున్న వారి సంఖ్య బాగా పడిపోయింది. ఇక బాలీవుడ్ నార్త్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండియా వైడ్‌గా ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న అక్షయ్ కుమార్ నటించిన బెల్‌బాటమ్, సూర్యవంశీ సినిమాలు ఆశించిన మేర బాక్సాఫీసు వద్ద సందడి చేయలేకపోయాయి.
లోకల్ సర్కిల్స్ సర్వే
ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేపట్టిన సర్వే సినిమా ఇండస్ట్రీకి ఉత్సాహం అందించే ఫలితాలను వెలువరించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 331 జిల్లాల నుంచి 19 వేల మందికి పైగా సినిమా గోయర్స్ నుంచి పలు దఫాలుగా సమాచారం సేకరించి విశ్లేషించింది. ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
థియేటర్లలో చూస్తాం
2021 డిసెంబరులో సేకరించిన సమాచారం ప్రకారం గత 60 రోజుల్లో సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా చూశామని చెప్పిన వాళ్ల సంఖ్య 14 శాతం ఉండగా 2022 ఫిబ్రవరి నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఇక సినిమాలకు కీలకమైన మార్చ్, ఏప్రిల్‌లలో థియేటర్‌కి వెళ్లి కచ్చితంగా సినిమా చూస్తామని చెప్పిన వారి సంఖ్య ఏకంగా 41 శాతంగా ఉంది.
కంటెంట్ ఉంటే కనక వర్షమే
లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం సినిమా గోయర్స్‌లో 75 శాతం మంది ఏడాది కాలంగా థియేటర్‌లో ఒక్క సినిమా కూడా చూడలేదు. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఈ సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పేందుకు మార్చిలో రిలీజైన కశ్మీర్‌ఫైల్స్ ఓ ఉదాహారణ. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ లేకపోయినా ప్రేక్షకులను కదిలించే కంటెంట్ ఉండటంతో సినిమా గోయర్స్ థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృస్టిస్తోంది.
రికార్డులు ఖాయం
కశ్మీర్ ఫైల్స్ సినిమాకే బాక్సాఫీసు దగ్గర సందండి నెలకొంటే బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి అండ్ కో నుంచి వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ కంటెంట్ బాగుంటే థియేటర్లలో కనకవర్షమే అనే అంచనాలు నెలకొన్నాయి. పైగా లోకల్ సర్కిల్స్ సర్వేలో 44 శాతం శాంపిల్స్ మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల నుంచి తీసుకున్నారు. మల్టీప్లెక్సుల్లో ఎక్కువ రోజులు హౌజ్‌ఫుల్ బోర్డులు పడితే బాహుబలి 2, దంగల్ రికార్డులు చెరిగిపోవడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment