న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం నాలుగు రెట్లు జంప్‌చేసి రూ. 2,112 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 487 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 20,551 కోట్ల నుంచి రూ. 29,942 కోట్లకు ఎగసింది.
ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 5,17,395 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 4,54,200 వాహనాలను విక్రయించగా.. 63,195 యూనిట్లు ఎగుమతి చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత కారణంగా ఉత్పత్తిలో 35,000 వాహనాలవరకూ ప్రభావం పడినట్లు మారుతీ వెల్లడించింది. ఇందువల్లనే గత క్యూ2 లోనూ మొత్తం వాహన విక్రయాలు 3,79,541 యూనిట్లకు పరిమితమైనట్లు ప్రస్తావించింది.
పండుగల ప్రభావం
ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత, కోవిడ్–19 సవాళ్లు గతంలో వృద్ధిని దెబ్బతీసినప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు జోరందుకున్నట్లు వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రధానంగా పండుగల సీజన్ అమ్మకాలకు జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో కస్టమర్ల పెండింగ్ ఆర్డర్లు 4.12 లక్షల యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. వీటిలో ఇటీవల ప్రవేశపెట్టిన గ్రాండ్ వితారా, కొత్త బ్రెజ్జా తదితర మోడళ్ల కోసమే 1.3 లక్షల ముందస్తు బుకింగ్స్ నమోదైనట్లు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ విడిభాగాల లభ్యత, వ్యయ నియంత్రణ, ఉత్తమ ధరలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. తద్వారా మెరుగైన మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో మొత్తం 9,85,326 వాహనాలు విక్రయించగా.. పూర్తి ఏడాదిలో 20 లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు భార్గవ తెలియజేశారు. గతేడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 7,33,155 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 9,548 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 9,550 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం!
చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్!
Comments
Please login to add a commentAdd a comment