ముంబై: ఉద్యోగుల్లో 79 శాతం మంది తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఎడ్‌టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో కొత్త అవకాశాలు ఏర్పడడం తెలిసిందే. వీటికి ఆధునిక నైపుణ్యాలు కీలకంగా మారాయి. దీంతో తమ నైపుణ్యాలను ఆధునీకరించుకునేందుకు మెజారిటీ ఉద్యోగులు సుముఖంగా ఉన్నట్టు గ్రేట్ లెర్నింగ్ తెలిపింది.
‘అప్‌స్కిల్లింగ్ అవుట్‌లుక్ ఇన్ ఇండియా 2022’ పేరుతో నివేదిక విడుదల చేసింది. వెబ్3.0, మెటావర్స్, ఎన్‌ఎఫ్‌టీ తదితర నూతన డొమైన్‌ల విస్తరణతో 2022లోనూ నైపుణ్యాల పెంపు పట్ల అధిక సానుకూలత కనిపిస్తున్నట్టు తెలిపింది. గ్రేట్ లెర్నింగ్ తన డేటాబేస్‌లోని సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించగా, మరోవైపు పిక్సిస్ సంస్థ.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె తదితర పట్టణాలకు చెందిన 1,000 మంది ఉద్యోగుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఈ వివరాలను కూడా తన నివేదికకు జతపరిచింది.
నివేదికలోని అంశాలు..
► 79 శాతం మంది 2022లో నైపుణ్యాలను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ విషయంలో స్త్రీ, పురుషులు సమానంగా ఉన్నారు.
► ఐటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ట్రెయినింగ్, హెల్త్‌కేర్, కన్సల్టింగ్ సేవల్లోని వారు ఈ ఏడాది నైపుణ్యాల పెంచుకోవడం పట్ల ఆసక్తిగా ఉన్నారు.
► డిజిటల్‌కు డిమాండ్ పెరగడంతో ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్ రంగాల్లో నైపుణ్యాల పెంపు పట్ల సహజంగానే ఎక్కువ అనుకూలత వ్యక్తమైంది.
► కరోనా మహమ్మారి వల్ల వైద్య సేవలకు డిమాండ్ పెరగడంతో, డేటా, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ నైపుణ్యాల పట్ల నిపుణులు ఆసక్తిగా ఉన్నారు.
► డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మెషిన్ లెర్నింగ్, అనలైటిక్స్ విభాగాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
► ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ మంది నిపుణులు 2022లో నైపుణ్యాలు పెంచుకోవాలని అనుకుంటున్నారు.
► హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో టెక్నాలజీ, డేటా డొమైన్ నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
► మారుమూల ప్రాంతాల నుంచి పనిచేసే విధానం, ఆన్‌లైన్ నియామకాలు పెరుగుతున్న క్రమంలో నాగ్‌పూర్, ఎర్నాకులం, మైసూర్, జైపూర్, ఇండోర్ పట్టణాలు ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment