నీతా అంబానీ : తగ్గేదే..లే! ఈ విషయాలు మీకు తెలుసా? | Most Expensive Things  of Corporate Lady Nita Ambani | Sakshi
Sakshi News home page

Nita Ambani: రూ.100 కోట్ల కారు, డ్రైవర్‌ జీతం ఎంతంటే?

Published Tue, Nov 9 2021 12:06 PM | Last Updated on Thu, Nov 11 2021 2:44 PM

Most Expensive Things  of Corporate Lady Nita Ambani - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నీతా అంబానీ. రిలయన్స్‌ ఛైర్మన్‌ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ భార్యగా కంటే, కుటుంబ వ్యాపారంలో పాలు పంచుకుంటూ,  సంక్షేమ కార్యక్రమాలతోపాటు, దాతగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. 


• 1985లో 20 ఏళ్ళ వయసులో  ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీతో వివాహం


• ఆకాష్, ఇషా, అనంత్ అనే ముగ్గురు పిల్లలు
• ఫోర్బ్స్ 'ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్తల' జాబితాలో చోటు
 • ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో సభ్యురాలు 
• నీతా అంబానీకి  లగ్జరీ కార్లంటే  మోజు
• ఆడి ఏ9 కమేలియన్‌ అత్యంత విలాసవంతమైన కారున్న తొలి భారతీయ మహిళ
• ఈ  ప్రత్యేక ఎడిషన్  కారు ఖరీదు  సుమారు 100 కోట్ల రూపాయలు
• ఈ కారు డ్రైవర్ జీతం సంవత్సరానికి రూ.  24 లక్షలు.


• నీతా అంబానీ  కార్ల  లిస్ట్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ బెంజ్‌ ఎస్‌ క్లాస్, పోర్షే లాంటి మోడల్‌ కార్లు ఉన్నాయి.
• నీతా అంబానీ  డిజైన్స్‌ , స్టైల్స్‌ విషయంలో  చాలా అప్‌డేట్‌గా ఉంటారు. నీతా జ్యుయల్లరీ కలెక్షన్  చూస్తే కళ్లు తిరగాల్సిందే.

వేసింది మళ్లీ వేసేదే లే..
సాంప్రదాయ బంగారు ఆభరణాలు, హారాలు, వడ్డాణాలు వజ్రాల ఉంగరాలు, అరుదైన డైమండ్ చోకర్లు ఇలా కోట్లాది రూపాయల కలెక్షన్‌ ఆమె సొంతం. నీతా అంబానీ అత్యంత ఖరీదైన  చెప్పులు, షూ కలెక్షన్‌  గురించి చాలా మందికి తెలియదు. వేసినవి మళ్లీ వేయకుండా లగ్జరీకి, రాయల్టీకి పెట్టింది పేరుగా ఉంటాయి. పెడ్రో, జిమ్మీ చూ, గార్సియా మార్లిన్  తదితర విలాసవంతమైన బ్రాండ్‌లను ఆమె వాడతారు. 

రూ.40 లక్షల చీర
నీతా అంబానీ సారీ కలెక్షన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతటి సెలబ్రిటీలైనా నీతా తరువాతే ఎవరైనా.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరలలో ఒకటిగా పేరొందిన  రూ.40 లక్షల చీరను ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ధరించడం విశేషం. జాకెట్టు వెనుక భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన శ్రీకృష్ణుడి అందమైన చిత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ చీరను చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం డిజైన్ చేశారు. కేవలం పట్టు చీరలు, బంగారంతో, చేతితో నేసిన చీరలే కాదు రియల్‌ డైమండ్స్‌, రూబీ, పుఖ్‌రాజ్, పచ్చ, ముత్యాలు, ఇతర మరెన్నో అరుదైన రత్నాలు పొదిగిన చీరలు ఆమె వార్డ్‌​ రోబ్‌లో కొలువు దీరాయి.  

కళ్లు చెదిరే లిప్‌స్టిక్ కలెక్షన్ 
సాంప్రదాయ దుస్తులు, అరుదైన ఆభరణాలు, హై-బ్రాండ్ షూసే కాదు నీతా అంబానీకి లిప్‌స్టిక్‌లపై కూడా పిచ్చి ప్రేమ. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిప్‌స్టిక్‌ల అరుదైన సేకరణ ఆమె సొంతం. లిపిస్టిక్‌ ​ ప్యాకేజ్‌లే బంగారం, వెండితో తయారు చేసినవి అంటే ఆమె రేంజ్‌ అర్థం చేసుకోవచ్చు. నీతా అంబానీ లిప్‌స్టిక్ కలెక్షన్ విలువ రూ. 40 లక్షలట.

కార్పొరేట్‌ జెట్‌
2007లో, ముఖేశ్‌ అంబానీ తన అందమైన భార్య నీతాకు విలాసవంతమైన కార్పొరేట్  జెట్‌ను పుట్టినరోజు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని అంచనా ధర రూ. 240 కోట్లు.  కస్టమ్-ఫిట్  చేసిన ఆఫీస్‌, ఒక ప్రైవేట్ క్యాబిన్, శాటిలైట్ టెలివిజన్ సెట్‌లు, వైర్‌లెస్ కమ్యూనికేషన్, మాస్టర్ బెడ్‌రూమ్, విలాస వంతమైన బాత్‌రూమ్‌లు ఇందులో ఉన్నాయి. మరో పుట్టినరోజుకు దుబాయ్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కారును బహుమతిగా ఇచ్చారు ముఖేశ్‌. 3 లక్షల వజ్రాలు పొదిగిన దీని ధర రూ.30 కోట్లు.

కోట్ల విలువచేసే  జపనీస్ టీ సెట్ 
పురాతన అరుదైన వస్తువుల పట్ల నీతా అంబానీకి అమితమైన ప్రేమ. జపాన్‌లోని పురాతన కత్తుల సెట్ తయారీదారులు నోరిటాకేకుచెందిన స్పెషల్‌ టీ సెట్‌ దీనికి ఉదాహరణ. దీని అంచనా ధర రూ. 1.5 కోట్లు.

లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు
ఫ్యాషన్‌ ఐకాన్‌గా డేన్సర్‌గా, డిజైనర్‌గా  ఆకట్టుకునే 'కార్పొరేట్ లేడీ' నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ల గురించి పత్ర్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. కార్పొరేట్ మీట్‌  నుండి  ఫ్యామిలీ  ఈవెంట్‌ల వరకు, నీతా అంబానీకి అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే. ప్రపంచంలోనే ఖరీదైన బ్రాండ్స్‌ ఫెండి, సెలిన్ నుండి హెర్మేస్ వరకు ప్రతీదీ స్పెషల్‌ ఎట్రాక్షనే. దీంతోపాటు ఆమె ధరించే కార్టియర్, బల్గారీ, గూచీ లాంటి పాపులర్‌ బ్రాండ్‌ల వాచెస్ మరో ప్రత్యేక ఆకర్షణ

ఫిట్‌గా ఉండేందుకు డైట్‌, వర్క్‌అవుట్స్‌
కఠినమైన డైట్ ప్లాన్‌ పాటిస్తారు నీతా. ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ , ఎగ్‌ వైట్‌ అల్పాహారం. మధ్యాహ్న భోజనంలో సూప్‌, తాజా ఆకుకూరలు, కూరగాయలను ఇష్టపడతారు. రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు, మొలకలు, సూప్ తీసుకుంటారు.  రోజంతా మధ్యలో పండ్లు తీసుకుంటారు. అం‍తేకాదు ఎంత రాత్రి అయినా, ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా వర్కౌట్ సెషన్‌ను అస్సలు మిస్‌ కారు. స్విమ్మింగ్‌, యోగా శాస్త్రీయ నృత్యం వంటి అనేక శారీరక వ్యాయామాలను చేస్తారు.

తనను తాను హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు డిటాక్స్ వాటర్‌తోపాటు,  బీట్‌రూట్ రసాన్ని డిటాక్స్ వాటర్‌గా తాగడానికి ఇష్టపడతారు నీతా. బీట్‌రూట్ జ్యూస్  శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అందుకే ఆమె చర్మం ఎపుడు మెరుస్తూ, తాజాగా ఉంటుంది. ఇంటి నుండి బయటకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఆమెకు కొత్త చెప్పులు లేదా షూస్‌ ఉండాల్సిందే. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్‌ అయిన నీతా  అడ్మిషన్ సీజన్‌లో అస్సలు ప్రయాణాలు పెట్టుకోరు. ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. బాలికా విద్యా, మహిళా క్రీడా​కారులకు అండగా నిలుస్తారు. దీంతోపాటు కరోనా సమయంలో అనేక చారిటీ కార్యక్రమాలను కూడా  నిర్వహించారు.

- సాక్షి, వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement