ప్రపంచ మార్కెట్ల లాభాల ప్రభావంతో మన మార్కెట్ కూడా మంగళవారం లాభాల్లోనే ముగిసింది. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ జోడీల షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడం కలసివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని 74.78కు చేరడం, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 225 పాయింట్లు ఎగసి 38,407 పాయింట్ల వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11,323 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా నాలుగో రోజూ, నిఫ్టీ ఆరో రోజూ లాభపడ్డాయి. యాక్టివ్ కరోనా కేసులు తగ్గుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
జోరుగా విదేశీ పెట్టుబడులు...: కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో మన మార్కెట్ దూసుకుపోతోందని నిపుణులంటున్నారు. మరో దఫా కేంద్రం నుంచి ఉద్దీపన చర్యలు ఉండొచ్చన్న అంచనాలు కూడా తోడయ్యాయని వారంటున్నారు. ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకూ మన మార్కెట్లో రూ.10,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.
లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...!
అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఒక అంగీకారం కుదరొచ్చన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తాజాగా చర్చలు మొదలుకావడం, కరోనా వైరస్ కట్టడికి ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా ఒక వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం సానుకూల ప్రభావం చూపించాయి.
♦ క్యూఐపీ మార్గంలో రూ.10,000 కోట్లు సమీకరించిన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 4 శాతం లాభంతో రూ. 448 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
♦ దాదాపు 200కు పైగా షేర్లు ఏడాది గరిష్టాలకు చేరాయి. భారత్ రసాయన్, ఎస్‌ఆర్‌ఎప్, టొరెంట్ ఫార్మా జాబితాలో ఉన్నాయి.
♦ దాదాపు 400కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. యస్ బ్యాంక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, లెమన్ ట్రీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment