హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు కొరత | Office Space in top 7 cities down 4percent in July-September month | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌కు కొరత

Published Wed, Nov 20 2024 6:34 AM | Last Updated on Wed, Nov 20 2024 6:34 AM

Office Space in top 7 cities down 4percent in July-September month

సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 25 శాతం తక్కువ సరఫరా 

స్థూల లీజింగ్‌లో 25 శాతం క్షీణత 

ప్రధాన నగరాల్లో 4 శాతం డౌన్‌ 

రియల్టీ కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కార్యాలయ వసతులకు (ఆఫీస్‌ స్పేస్‌) సంబంధించి కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) పరిమితమైంది. స్థూల లీజింగ్‌ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త కార్యాలయ వసతుల సరఫరా జూలై–సెప్టెంబర్‌ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్‌ వర్క్‌స్పేస్‌ (ప్రధాన ప్రాంతాల్లో) స్థూల లీజింగ్‌ 17 శాతం పెరిగి 18.61 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీలకు చేరింది. ఈ వివరాలను రియల్టీ కన్సల్టెంట్‌ ‘వెస్టియన్‌’ విడుదల చేసింది. 

నగరాల వారీ వివరాలు..  
→ బెంగళూరులో ఆఫీస్‌ స్పేస్‌ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. ఇక్కడ లీజింగ్‌ 84 శాతం పెరిగి 6.63 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో సరఫరా 360 శాతం అధికమై 2.3 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. స్థూల లీజింగ్‌ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. 
→ పుణెలో ఆఫీస్‌ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ఇక్కడ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 112 శాతం పెరిగి 2.33 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.  
→ ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. స్థూల లీజింగ్‌ 2 శాతం తగ్గి 2.25 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ చెన్నైలో తాజా ఆఫీసు వసతుల సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. లీజింగ్‌ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. 
→ కోల్‌కతాలో గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో సెప్టెంబర్‌ క్వార్టర్‌లో తాజా సరఫరా లేదు. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 45 శాతం తక్కువగా 0.11 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. 
→ బీఎఫ్‌ఎస్‌ఐ, ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేటర్లు ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ కీలక చోదకాలుగా ఉన్నట్టు వెస్టియన్‌ తెలిపింది.  

వేగంగా వృద్ధి చెందుతున్న భాగ్యనగరం 
దేశ వ్యాప్తంగా ఆరు ప్రముఖ నగరాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌కు మొదటి స్థానం దక్కింది. పరిపాలన, సామాజిక ఆర్థిక అంశాలు, రియల్‌ ఎస్టేట్, మౌలిక వసతుల ఆధారంగా నైట్‌ఫ్రాంక్‌ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. వివిధ వృద్ది అంశాల ఆధారంగా ఆరు ప్రధాన నగరాల పనితీరును నైట్‌ఫ్రాంక్‌ విశ్లేషించింది. ‘‘వీటిల్లో హైదరాబాద్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 

బలమైన మౌలిక వసతుల అభివృద్ధి,  రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ పెరగడం, అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు(అధిక ధనవంతులు), హెచ్‌ఐఎన్‌ల జనాభా పెరుగుదల, చురుకైన విధానాలు సామాజిక ఆర్థిక పరపతిని పెంచుతున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. అద్భుతమైన నిపుణుల లభ్యత, వ్యాపార నిర్వహణకు ఉన్న అనుకూలతలతో బెంగళూరు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో నగరంగా నిలిచింది. ముంబై ఎప్పటి మాదిరే అన్ని అంశాల్లో స్థిరమైన పురోగతి చూపించింది. దేశ ఆర్థిక రాజధాని హోదాను కాపాడుకుంది. విడిగా చూస్తే గొప్ప మౌలిక వసతులు, పరిపాలన పరంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. సామాజిక ఆర్థిక అంశాల పరంగా బెంగళూరు ముందంజలో ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వృద్ధి పరంగా హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement