
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
భారతీయ విఫణిలో.. ప్రారంభం నుంచి అనేక విమర్శలకు గురవుతూ వస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పటికి కూడా విక్రయానంత సేవలు అందించడంలో అంతంత మాత్రంగానే ఉందని.. చాలామంది కస్టమర్లు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగులను తొలగించడం అనేది కంపెనీ తీసుకున్న కఠినమైన నిర్ణయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ లేఆఫ్స్ ప్రక్రియ జులై నుంచి కొనసాగుతున్నట్లు, ఇందులో భాగంగానే దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ నెల చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగులతో కంపెనీ లాభాలను గడించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.