After Google Now Apple Delays Return To Office Deadline Indefinitely: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియెంట్ ఆందోళన కొనసాగుతోంది. కరోనా వైరస్‌లో శరవేగంగా విస్తరిస్తున్న వేరియెంట్ కావడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల భద్రత దృష్ట్యా మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటున్నాయి కంపెనీలు.
గూగుల్ ఇదివరకే ఆఫీస్ రిటర్న్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేయగా.. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ అదే బాటలో పయనించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ప్రకటించిన యాపిల్.. ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రతీ ఉద్యోగికి 1,000 డాలర్ల(76 వేల రూ. పైనే) వర్క్‌ఫ్రమ్ హోం బోనస్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది కూడా.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! కేంద్రం కీలక నిర్ణయం..!
దీంతో మరికొన్ని కంపెనీలు ఈ జాబితాలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గూగుల్ కూడా ఇలాగే వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగిస్తూ.. ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి కంపెనీలు ఈ ఏడాది జూన్ నుంచే వర్క్‌ఫ్రమ్‌కు ఎండ్‌కార్డ్ వేయాలనుకున్నాయి. కానీ, డెల్టా ఫ్లస్ వేరియెంట్, ఆ వెంటనే ఒమిక్రాన్ వేరియెంట్లు వచ్చి పడ్డాయి. అయినప్పపటికీ వ్యాక్సినేషన్ కారణంగా ఏది ఏమైనా ఈ జనవరి నుంచి ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని నిర్ణయించుకున్నాయి. కానీ, ఒమిక్రాన్ ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో పాకేసింది. గాలిలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ వేరియంట్ ప్రమాదకరమైందనే సంకేతాలిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్యం పట్ల రిస్క్ తీసుకునే ఉద్దేశంతో కంపెనీలు లేనట్లు కనిపిస్తున్నాయి.
మరోవైపు భారత్‌లోనూ వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా ఉద్యోగుల్ని మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పిస్తుండగా.. మరికొన్ని 45 ఏళ్లలోపు వాళ్లను మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలావరకు మాత్రం 2022లోనూ వర్క్‌ఫ్రమ్ హోం విధాన కొనసాగింపుకే మొగ్గు చూపిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి కూడా.
Comments
Please login to add a commentAdd a comment