న్యూఢిల్లీ: మళ్లీ విమాన ప్రయాణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నవంబర్ నెలలో 1.05 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. అక్టోబర్ నెలలో 89.85 లక్షల మందితో పోల్చి చూస్తే.. నవంబర్లో ప్రయాణికుల రద్దీ 17.03 శాతం పెరిగినట్టు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదుల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
టాప్‌లో ఇండిగో
ఇండిగో ఒక్కటే 57.06 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. తద్వారా దేశీ పౌర విమానయాన మార్కెట్లో ఈ సంస్థ 54.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ సేవలను 10.78 లక్షల మంది ప్రయాణికులు (10.3 శాతం మార్కెట్ వాటా) వినియోగించుకున్నారు. ఎయిర్ ఇండియా 9.98 లక్షల మంది, గోఫస్ట్ 11.56 లక్షల మంది, విస్తారా 7.93 లక్షల మంది, ఎయిరేషియా ఇండియా 6.23 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ 1.23 లక్షల మందికి సేవలు అందించాయి.
ఓఆర్‌లో స్పైస్‌జెట్
విమానాల ఆక్యుపెన్సీ రేటు (మొత్తం సీట్లలో భర్తీ అయినవి) చూస్తే.. స్పైస్‌జెట్ 86.7 శాతం, ఇండిగో 80.5 శాతం, విస్తారా 77 శాతం, గోఫస్ట్ 78.2 శాతం, ఎయిర్ ఇండియా 82 శాతం, ఎయిర్‌రేషియా 74.6 శాతం చొప్పున నవంబర్‌లో నమోదు చేశాయి. సకాలంలో సేవల విషయంలో విస్తారా ముందుంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నుంచి సకాలంలో సేవల విషయంలో 84.4 శాతం రేటును నమోదు చేసింది. ఎయిరేషియా ఇండియా 82.4 శాతం, ఇండిగో 80.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment