ముంబై: ఈ–రిక్రూమెంట్ నవంబర్ నెలలో, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఒక శాతం తగ్గినట్టు ఫౌండిట్ ఇన్‌సైట్ ట్రాకర్ (లోగడ మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) తెలిపింది. ఈ వివరాలను మంగళవారం విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌లో నెలవారీగా నియామకాల్లో స్థిరమైన వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. నెలల తరబడి క్షీణత తర్వాత, ఐటీ, మీడియా పరిశ్రమల్లోనూ నియామకాలు నవంబర్‌లో పుంజుకున్నట్టు తెలిపింది. ‘‘టెక్నాలజీ నిపుణుల నియామకాలు గడిచిన కొన్ని నెలల్లో తగ్గినప్పటికీ.. విద్య, ఆరోగ్యం తదితర పరిశ్రమలు సమర్థత, ఉత్పాదకత కోసం టెక్నాలజీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండడం అనుకూలం’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరిసా తెలిపారు.
ఖర్చు చేసే శక్తి
రియల్ ఎస్టేట్‌లో బూమ్ భారతీయుల ఖర్చు చేసే శక్తిని తెలిజేస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టుబడులకు భారతీయులు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. మొత్తం మీద భారత ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తు సానుకూలంగా ఉన్నట్టు ఫౌండిట్ తెలిపింది. రానున్న నెలల్లో ఇది మరింత బలపడుతుందని అంచనా వేసింది. ఆన్‌లైన్‌లో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో నెలవారీగా పోస్ట్ చేసే కొత్త ఉద్యోగాల సమాచారాన్ని ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ విశ్లేషిస్తూ నివేదికను విడుదల చేస్తుంటుంది. మౌలిక సదుపాయాలను శరవేగంగా అభివృద్ధి చేస్తుండడం, వివిధ ప్రాంతాల మధ్య పెరిగిన అనుసంధానత, నైపుణ్య మానవ వనరుల అందుబాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఉద్యోగ మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తున్నట్టు ఫౌండిట్ తెలిపింది.
పట్టణాల వారీగా..
చండీగఢ్‌లో 8 శాతం, బరోడాలో 5 శాతం, అహ్మదాబాద్‌లో 3 శాతం మేర వృద్ధి నవంబర్‌లో (అక్టోబర్‌తో పోల్చినప్పుడు) కనిపించింది. లాజిస్టిక్స్, కొరియర్, రవాణా విభాగాల్లో డిమా ండ్ పెరగడంతో అహ్మదాబాద్‌లో 6 శాతం, కొయంబత్తూర్‌లో 2 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ముంబైలో అధిక వృద్ధి నమోదైంది. ఇక్కడ రియల్ ఎస్టేట్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలు అధిక నియామకాలు చేపట్టాయి.
హైదరాబాద్‌లో 6 శాతం డౌన్
భాగ్యనగరంలో నియామకాలు నవంబర్‌లో 6 శాతం తగ్గినట్టు ఫౌండింట్ నివేదిక తెలిపింది. ఇక బెంగళూరులో 9%, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 3%, పుణెలో 2 శాతం, చెన్నైలో 4 శాతం, కోల్‌కతాలో అత్యధికంగా 18% చొప్పున క్రితం ఏడాది నవంబర్‌తో పోలిస్తే నియామకాలు తగ్గాయి.
చదవండి: లేడీ బాస్ సర్‌ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment