న్యూఢిల్లీ: దేశీ ఇంటర్నెట్ కన్జూమర్ విభాగంలో తాజాగా అతిపెద్ద ఒప్పందానికి తెరలేచింది. ఫిన్‌టెక్ బిజినెస్ సంస్థ పేయూ.. డిజిటల్ పేమెంట్స్ సర్వీసుల సంస్థ బిల్‌డెస్క్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 4.7 బిలియన్ డాలర్లు(రూ. 34,376 కోట్లు) వెచ్చించనుంది. దీంతో పేయూ మాతృ సంస్థ, నెదర్లాండ్స్ దిగ్గజం ప్రోసస్ ఎన్‌వీ దేశీ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్ల(రూ. 73,140 కోట్లు)కు చేరనున్నాయి.
అయితే బిల్‌డెస్క్, పేయూ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతి లభించవలసి ఉంది. 2022 తొలి త్రైమాసికానికల్లా ఒప్పందం పూర్తయ్యే వీలున్నట్లు ప్రోసస్ గ్రూప్ సీఈవో బాబ్ వాన్ డిక్ అభిప్రాయపడ్డారు. రెండు సంస్థల కలయికతో డిజిటల్ పేమెంట్స్ విభాగంలో దేశీయంగానూ, గ్లోబల్ స్థాయిలోనూ లీడింగ్ కంపెనీ ఆవిర్భవించనున్నట్లు పేర్కొన్నారు. వేగవంత వృద్ధిలో ఉన్న దేశీ ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌లో మరింత లోతైన, మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలియజేశారు.
2005 నుంచీ..: దేశీయంగా ప్రోసస్ దీర్ఘకాలిక పెట్టుబడిదారుగా నిలుస్తున్నట్లు డిక్ పేర్కొన్నారు. 2005 నుంచీ టెక్ కంపెనీలలో దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తాజా లావాదేవీతో ఈ పెట్టుబడులు 10 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు తెలియజేశారు. ఇది భారత్ మార్కెట్‌పట్ల తమకున్న కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ పెట్టుబడులకు దేశీ మార్కెట్ కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రానున్న దశాబ్దంలోనూ గ్రూప్ వృద్ధికి భారీగా దోహదపడనున్నట్లు తెలియజేశారు. రానున్న కొన్నేళ్లలో 20 కోట్లమందికిపైగా కొత్త వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. మూడేళ్ల కాలంలో ఒక్కో వ్యక్తి సగటు లావాదేవీలు 10 రెట్లు జంప్‌చేసి 22 నుంచి 220కు చేరనున్నట్లు అభిప్రాయపడ్డారు.
పలు కంపెనీలలో..: ప్రోసస్ ఇప్పటికే బైజూస్, స్విగ్గీ, అర్బన్ కంపెనీ తదితర పలు కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. పేయూ ద్వారా సిట్రస్‌పే, పేసెన్స్, విబ్మోలనూ సొంతం చేసుకుంది. అత్యధిక వృద్ధిలో ఉన్న 20 మార్కెట్లలో కార్యకలాపాలు విస్తరించిన పేయూ తాజా కొనుగోలుతో ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ పేమెంట్ సర్వీసుల సంస్థలలో ఒకటిగా ఆవిర్భవించనుంది.
2000లో షురూ
బిల్‌డెస్క్ కార్యకలాపాలు 2000లో ప్రారంభమయ్యాయి. కంపెనీలో జనరల్ అట్లాంటిక్, వీసా, టీఏ అసోసియేట్స్, క్లియర్‌స్టోన్ వెంచర్, టెమాసెక్ తదితర దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ నెట్‌వర్క్‌ను కొన్ని దిగ్గజ బ్యాంకులతోపాటు, యుటిలిటీస్, టెలికం, బీమా తదితర పలు విభాగాలకు చెందిన చాలా కంపెనీలు వినియోగిస్తున్నాయి. పేయూ, బిల్‌డెస్క్ సంయుక్తంగా ఏడాదికి 4 బిలియన్ లావాదేవీలను నిర్వహించే అవకాశమున్నదని పేయూ సీఈవో అనిర్బన్ ముఖర్జీ అంచనా వేశారు. దశాబ్ద కాలంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో కంపెనీ అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు బిల్‌డెస్క్ సహవ్యవస్థాపకుడు ఎంఎన్ శ్రీనివాసు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment