ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వాహణ విషయంలో బ్యాంకులు చేస్తోన్న తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరో ఉదాహరణగా నిలుస్తోంది.
కిసాన్ యోజన
దేశంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000లను కేంద్రం అందిస్తోంది. ప్రతీసారి రూ. 2,000ల వంతున మూడు విడతలుగా ఈ సాయం చేస్తోంది. ఈ పెట్టుబడి సాయం నేరుగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది.
వ్యవసాయ శాఖ లెక్కలు
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద దేశ వ్యాప్తంగా 68.76 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతీ నాలుగు నెలలకు రెండు వేల వంతున జమ చేస్తున్నారు. అయితే రెండేళ్ల కాలానికి సంబంధించి ఎంత మంది రైతులకు సాయం చేశారనే వివరాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ ప్రకటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దాదాపు దేశ వ్యాప్తంగా ఒక శాతం మంది రైతులకు పెట్టుడి సాయం అందలేదు.
41 లక్షల మంది రైతులు రూ. 820 కోట్లు
2019 ఫిబ్రవరి నుంచి 2021 జూన్ 30 వరకు సేకరించిన వివరాల్లో ఆన్‌లైన్ ట్రాన్సాక‌్షన్ ఫెయిల్ కావడం వల్ల ఏకంగా 61.04 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కాలేదు. బ్యాంకులు మరోసారి ప్రయత్నించగా విఫలమైన ఖాతాల్లో 34 శాతం మేరకు అంటే 20.88 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా జమ కాలేదు. అంటే దాదాపు రూ.820 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలకు చేరనేలేదు.
అక్కడే ఎక్కువ
వెనుకబాటుతనం ఎక్కువగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే ఈ తరహా ఫెయిల్డ్ ట్రాన్సక‌్షన్స్ ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ 10.95 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వారు ఫిర్యాదులు చేయగా ఇందులో కేవలం 8 శాతం మందికి అంటే 91 వేల మందికి తిరిగి డబ్బులను బ్యాంకులు జమ చేశాయి. బీహార్ విషయానికి వస్తే 1.38 లక్షల విఫల లావాదేవీలు ఉండగా ఇందులో కేవలం 6.8 శాతం మందికే 9,493 మందికే తిరిగి డబ్బులు జమ అయ్యాయి.
నిర్లక్ష్యం
ఫెయిల్డ్ ట్రాన్సాక‌్షన్స్‌కి సంబంధించిన డబ్బు తిరిగి ప్రభుత్వం వద్దకే చేరిందా ? లేక బ్యాంకర్ల దగ్గరే ఆగిపోయిందా అనే అంశంపై స్పష్టత లేదు. కానీ 41 లక్షల మంది రైతులకు అందాల్సిన రూ. 820 కోట్లు దక్కకుండా పోయాయి. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకర్లు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment