
15 శాతం పెరగనున్న ఏఆర్‌పీయూ
కేర్ రేటింగ్స్ నివేదిక
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపుతో దేశీయంగా టాప్ మూడు టెలికం కంపెనీలకు ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) 15 శాతం పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20–22 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది.
స్పెక్ట్రం కొనుగోలు, 5జీ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ పెట్టుబడులపై రాబడి పొందడానికి తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది సానుకూలంగా పరిణమించగలదని కేర్ రేటింగ్స్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 191గా ఉన్న ఏఆర్‌పీయూ ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధితో రూ. 220కి చేరవచ్చని విశ్లేషించింది.
ప్రతి రూ. 1 ఏఆర్‌పీయూ పెరుగుదలతో పరిశ్రమ నిర్వహణ లాభాలు రూ. 1,000 కోట్ల స్థాయిలో పెరుగుతాయని తెలిపింది. ఏఆర్‌పీయూ, లాభాల పెరుగుదలతో టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు టెల్కోలకు వెసులుబాటు లభించగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రుణ భారం కొంత దిగి వస్తుందని నివేదిక తెలిపింది. ఇటీవల జూన్‌లో ముగిసిన స్పెక్ట్రం వేలంలో టెల్కోలు పెద్దగా పాల్గొనకపోవడంతో .. రాబోయే రోజుల్లో రుణ భారం క్రమంగా మరింత తగ్గగలదని పేర్కొంది.