Rameshwaram Cafe Founder Success Story: ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించాలంటే దాని వెనుక కంటికి కనిపించని యుద్ధమే చేసి ఉండాలి. అప్పుడే ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోగలరు.. నిలదొక్కుకోగలరు. ఇలాంటి కోవకు చెందిన వారిలో బెంగళూరుకు చెందిన 'దివ్య' ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, అప్పుడే అనుకున్నది చేయవచ్చని తల్లితండ్రులు చెప్పిన మాటలు తు.చ తప్పకుండా పాటిస్తూ సీఏ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను, లెక్కకు మించిన సవాళ్ళను ఎదుర్కొంది. ఖర్చుల కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సిన రోజులు, రోజుకి రెండు మూడు బస్సులు మారాల్సిన పరిస్థితులు అనుభవించింది. అనుకున్న విధంగానే సీఏ పూర్తి చేసింది.
సీఏ పూర్తి చేసి..
తన కుటుంబంలో సీఏ పూర్తి చేసిన మొదటి వ్యక్తి 'దివ్య' కావడం గమనార్హం. అంతే కాకుండా ఈమె IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో సభ్యురాలిగా కొనసాగుతోంది. కాగా ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలనే కోరికతో ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని యోచించింది.
రామేశ్వరం కెఫే..
చదువుకునే రోజుల్లో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ఆహార సంస్థలు మంచి లాభాలను తీసుకొస్తాయని గ్రహించి, దక్షిణ భారతదేశ రుచులను అందరికి అందేలా చేయడానికి కంకణం కట్టుకుంది. ఈ ఆలోచనను తన అమ్మతో చెప్పింది. ఇది విన్న దివ్య తల్లి మేము కస్టపడి సీఏ చదివిస్తే.. ఇడ్లీ, దోశలు అమ్ముతావా అని చీవాట్లు పెట్టింది. తన నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు. కానీ పట్టు వదలకుండా తన భర్త రాఘవేంద్ర రావుకి పెళ్లికి ముందు నుంచే ఈ వ్యాపారం మీద కొంత అనుభవం ఉండటం వల్ల 2021లో 'రామేశ్వరం కెఫే' ప్రారంభించింది. ప్రారంభంలో రెండు బ్రాంచీలతో మొదలైన వీరి వ్యాపారం, క్రమంగా వృద్ధి చెందింది.
(ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..)
ప్రస్తుతం 'రామేశ్వరం కెఫే' ద్వారా ఇడ్లీ, దోశ, వడలు, పొందాలి, రోటీ వంటివి విక్రయిస్తూ బెంగళూరులో తనదైన రీతిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. బెంగళూరులోని ఇతర కెఫేలు మాదిరిగా కాకుండా వీరు ఫ్రిజ్ వంటివి కూడా వాడరు, అందువల్ల పదార్థాలు ఎప్పుడు చాలా రుచికరంగా ఉంటాయని వినియోగదారులు చెబుతుంటే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందంటున్నారు.
(ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?)
నెలకు రూ. 4.5 కోట్లు..
ప్రస్తుతం బెంగళూరులో నాలుగు కెఫేలు నడుపుతున్నారు, కాగా రానున్న రోజులో దేశం మొత్తం మీదనే కాకుండా విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్లు దివ్య చెబుతోంది. ఈమె అటు సీఏ కెరీర్ ఇటు వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. కొన్ని నివేదికల ప్రకారం నెలకు సుమారు రూ. 4.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ జరుగుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment