పరిమిత శ్రేణిలో.. బలహీనంగా | RBI monetary policy and corporate results impact on market | Sakshi
Sakshi News home page

పరిమిత శ్రేణిలో.. బలహీనంగా

Published Mon, Aug 7 2023 6:26 AM | Last Updated on Mon, Aug 7 2023 6:26 AM

RBI monetary policy and corporate results impact on market - Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు ఈ వారంలో బలహీనంగా పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన వైఖరి, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడితో పాటు కీలక కార్పొరేట్‌ క్యూ1 ఫలితాల ప్రకటనల నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ ఉండొచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల తెరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్ల పనితీరు, క్రూడాయిల్‌ ధరల కదలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చంటున్నారు.  

  ‘‘ఆర్‌బీఐ వడ్డీరేట్ల నిర్ణయం ప్రకటన వెలువడనున్న కారణంగా వచ్చే వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో ఊగిసలాటకు లోనవుతూ బలహీనంగా కదలాడొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ దిగువున 19,100–19,300 శ్రేణిలో నిరోధాన్ని కలిగి ఉంది. ఎగువు స్థాయిలో 19,650–19,850 పరిధిలో నిరోధం ఉంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమా తెలిపారు.   

బ్రోకరేజ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడం, యూఎస్‌ బాండ్లపై రాబడులు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు, చైనా–యూరోజోన్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం తదితర అంశాలతో గత వారం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. అయితే ఇటీవల సూచీల సు«దీర్ఘర్యాలీ నేపథ్యంలో ఈ పరిణామాలు లాభాల స్వీకరణకు ఊతమిచ్చాయని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 439 పాయింట్ల, నిఫ్టీ 129 పాయింట్లు చొప్పున కోల్పోయాయి.  

గురువారం ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ వెల్లడి ఆర్‌బీఐ ద్రవ్య పాలసీ కమిటీ మంగళవారం(ఆగస్టు 8న) ప్రారంభవుతుంది. చైర్మన్‌ శక్తికాంత దాస్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం(ఆగస్టు 10న) వెల్లడించనున్నారు. వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లను 6.5% వద్దే యథాతథంగా ఉంచొచ్చని ఎక్కువ మంది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూన్‌ ద్రవ్యోల్బణం 5% లోపై 4.8 శాతంగా ఉన్నప్పట్టకీ.., అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు, రుతు పవనాల అస్థిరతతో పెరుగుతున్న కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్‌బీఐ కమిటీ వడ్డీరేట్ల జోలికెక్కపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.  

తుది దశలో కార్పొరేట్‌ ఫలితాలు
దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్‌ తుది దశకు చేరింది. ఈ వారంలో సుమారు 1,800కి పైగా కంపెనీలు తమ క్యూ1తో పాటు గత ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి గణాంకాలను ప్రకటించనున్నాయి. అదానీ పోర్ట్స్, కోల్‌ ఇండియా, హిందాల్కో, గ్రాసీం, హీరో మోటో కార్ప్, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్, ఎల్‌ ఐసీ మొదలైనవి జాబితాలో ఉన్నాయి. వీటితో పా టు అంతర్జాతీయ కంపెనీలైన బేయర్, సాఫ్ట్‌బ్యాంక్, ఫాక్స్‌కాన్, సోనీ డిస్నీ, సిమెన్స్‌ సంస్థలు ఇదే వారంలో త్రైమాసిక ఫలితాలు వెల్లడించను న్నాయి.  కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ అధికంగా ఉండొచ్చు. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది.

స్థూల ఆర్థిక గణంకాల ప్రభావం  
అమెరికా ఈ వారంలో వాణిజ్య లోటు, ద్ర వ్యోల్బణ, నిరుద్యోగ డేటా, ఇన్వెంటరీ, కన్జూమర్‌ గణాంకాలు వెల్లడించనున్నాయి. బ్రిటన్‌ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ, జీడీపీ డేటాను ప్రకటించనుంది. చైనా ఎఫ్‌డీఐ, ద్రవ్యోల్బణ, ప్రొడ్యూసర్‌ ప్రైజర్‌ ఇండెక్స్, వాణిజ్య లోటు డేటా విడుదల కానుంది. ఇదే వారంలోనే భారత్‌ పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది.  

ప్రాథమిక మార్కెట్‌పై దృష్టి
ఇటీవల ఐపీవోలను పూర్తి చేసుకున్న యధార్థ్‌ హాస్పిటల్‌ అండ్‌ ట్రామా కేర్‌ షేర్లు నేడు ఎక్సే్చంజ్‌ల్లో లిస్ట్‌ కానున్నాయి. గత వారంలో ప్రారంభమైన ఎన్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ(ఆగస్టు 7న), కాంకర్డ్‌ బయోటెక్‌ ఐపీఓ మంగళవారం (ఆగస్టు 8న) ముగియనున్నాయి. ఈ వారంలో టీవీస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ (ఆగస్టు10 –14 తేదీ) ఉంది. ఈ నేపథ్యంలో లిస్టింగ్‌ల తీరు.., ఐపీఓ స్పందనలను ఇన్వెస్టర్లు గమనించవచ్చు.  

ఆగస్టు తొలివారంలో రూ. 2వేల కోట్లు వెనక్కి...
దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్టు తొలివారంలో రూ.2,000 కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకున్నారు. రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ రేటింగ్స్‌ అమెరికా రుణ రేటింగ్‌ను తగ్గించడంతో ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ‘‘భారత మార్కెట్ల వాల్యూయేషన్‌ ప్రీమియం కావడం, ఇటీవల ర్యాలీ నేపథ్యంలో లాభాల స్వీకరణ వంటి అంశాలు కూడా విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణకు కారణం కావచ్చు. అమెరికా పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ నాలుగు శాతం కంటే ఎక్కువ పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడులకు ప్రతికూలంగా మారింది’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ నిటాషా శంకర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement