ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు | RBI Supersedes Abhyudaya Cooperative Bank Board | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు

Published Mon, Nov 27 2023 8:08 AM | Last Updated on Mon, Nov 27 2023 8:30 AM

 RBI Supersedes Abhyudaya Cooperative Bank Board - Sakshi

'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. కానీ ఇటీవల ఆర్‌బీఐ 'అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు'పై గట్టి చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..

బ్యాంకుల పనితీరుపై నిఘాపెట్టిన ఆర్‌బీఐ.. సరైన పాలన లేని కారణంగా, ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద ఏ మాత్రం ఉండదని వెల్లడించింది.

అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్‌బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉంటాయి. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల మీద అటువంటి ఆంక్షలు విధించలేదు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ 'సత్య ప్రకాష్ పాఠక్‌'ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది.

బ్యాంకింగ్ కార్యకలాపాల మీద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల రోజువారీ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 56, సెక్షన్ 36 AAA కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు అందించేందుకు ఆర్‌బీఐ ఒక కమిటీని నియమించింది. ఇందులో వెంకటేష్ హెగ్డే, ఎస్‌బీఐ మాజీ జనరల్ మేనేజర్, మహేంద్ర ఛాజెడ్, సుహాస్ గోఖలే వంటి బ్యాంక్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు.

అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సందీప్ ఘండాత్ మాట్లాడుతూ.. మా బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్‌బీఐ నియమించిన అదనపు డైరెక్టర్ (రాజేంద్ర కుమార్) ఉన్నారని, ఆయన సెంట్రల్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయనతో 29న బ్యాంక్ అధికారుల సమావేశం ఉంది, అంతలోపే ఆర్‌బీఐ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే?

గత రెండు సంవత్సరాల్లో సహకార బ్యాంకు మొండి బకాయిలను రూ.1,550 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించగలిగిందని, బ్యాంకు మెరుగుపడుతున్న సమయంలో ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు.
 
అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుకు 109 బ్రాంచులు, 113 ఏటీఎంలు ఉన్నాయి. 2022 మార్చి నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.10,838.07 కోట్లు కాగా.. రుణాల విలువ రూ. 6,654.37 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ మహారాష్ట్రలో ,మాత్రమే కాకుండా కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా సేవలను అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement