
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తమ ‘బీవోబీ వరల్డ్’ మొబైల్ యాప్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. యాప్‌లో కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణాపరమైన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు వాటిని సరిచేసి, సంబంధిత ప్రక్రియను పటిష్టం చేసినట్లు ఆర్‌బీఐ సంతృప్తి చెందితే తప్ప కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉండదు. దీనివల్ల ప్రస్తుత బీవోబీ వరల్డ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ బ్యాంకుకు సూచించింది.
ఆర్‌బీఐ సూచించిన అంశాలను ఇప్పటికే సరిదిద్దినట్లు, ఇతరత్రా ఏవైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఆర్‌బీఐ ఆదేశాలను అమలు చేసే క్రమంలో కస్టమర్లకు సర్వీసులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది.