![RBI unveils UDGAM portal for search of unclaimed deposits - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/18/unclaimed-deposits-rbi-portal.jpg.webp?itok=9R11RquK)
ముంబై: అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను అన్వేషించేందుకు, క్లెయిమ్ చేసుకునేందుకు తోడ్పడేలా కేంద్రీకృత వెబ్ పోర్టల్ ఉడ్‌గమ్ (అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ – గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను గురువారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన తమ డిపాజిట్లన్నింటి గురించిన వివరాలను కస్టమర్లు ఒకే చోట తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రెబిట్), ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (ఐఎఫ్‌టీఏఎస్), భాగస్వామ్య బ్యాంకులు కలిసి దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధన్‌లక్ష్మి బ్యాంక్, సౌతిండియా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, సిటీబ్యాంక్ వంటి ఏడు బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి.
ఇతర బ్యాంకుల వివరాలను కూడా అక్టోబర్ 15 నాటికి దశలవారీగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్‌బీఐకి బదలాయించాయి. సిసలైన యజమానులు, లబ్ధిదారులకు ఆయా డిపాజిట్లను అందించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటోంది.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment