‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’ | Sakshi
Sakshi News home page

‘నేరుగా బ్యాంకు నుంచే రుణాలు ఇప్పించండి’

Published Tue, Mar 26 2024 8:39 AM

Reits Said Offer Debt Directly From Banks - Sakshi

బ్యాంకుల నుంచి నేరుగా రుణాన్ని పొందే సదుపాయాన్ని కల్పించాలని భారత స్థిరాస్తి పెట్టుబడుల ట్రస్టు (రీట్స్‌) పరిశ్రమ ఇండియన్‌ రీట్స్‌ అసోసియేషన్‌ (ఐఆర్‌ఏ)ను కోరింది. దాంతోపాటు రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరించాలని తెలిపింది. 

ప్రస్తుతం బాండ్ల జారీ లేదా బ్యాంకింగేతర సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం రీట్స్‌కు ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి లేదని ఇండియన్‌ రీట్స్‌ అసోసియేషన్‌ (ఐఆర్‌ఏ) తెలిపింది. కొత్తగా ఏర్పాటైన ఐఆర్‌ఏలో 5 నమోదిత సంస్థలు ఉన్నాయి. ఐఆర్‌ఏకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంబసీ రీట్స్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరవింద్‌ మైయా మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలకు అనుమతి పొందే విషయమై ఆర్‌బీఐతో చర్చిస్తున్నామని తెలిపారు. స్థిరాస్తి పరిశ్రమకు నిధులు భారీ స్థాయిలో కావాల్సి ఉంటుందని గుర్తు చేశారు. 

ప్రస్తుతం రీట్స్‌ను ‘హైబ్రిడ్‌’ పెట్టుబడి మార్గంగా వర్గీకరించారని, ఇది మదుపర్లను అయోమయానికి గురి చేస్తోందని బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌ ఎండీ, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలోక్‌ అగర్వాల్‌ వెల్లడించారు. రీట్స్‌ను ఈక్విటీలుగా వర్గీకరిస్తే.. ఇవి కూడా సూచీల్లో (ఇండెక్స్‌) చేరే వీలుండి, రీట్స్‌లోకి నిధుల రాక పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపారు. భారత్‌ రీట్స్‌ నిబంధనల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్‌తో పాటు అమెరికాలో రీట్స్‌ను ఈక్విటీగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్‌లో రీట్స్‌ రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరుగుతూనే ఉందని ఐఆర్‌ఏ తెలిపింది.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం

Advertisement
Advertisement