ముంబై, సాక్షి: కోవిడ్-19కు వ్యాక్సిన్లు, క్యూ2లో జీడీపీ పురోగతి నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సరికొత్త గరిష్టాల రికార్డులతో ప్రారంభమై హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైవర్సిఫైడ్ కంపెనీ టాటా కెమికల్స్, ఫైనాన్షియల్ రంగ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
టాటా కెమికల్స్
గ్రూప్ కంపెనీ టాటా కెమికల్స్‌లో ప్రమోటర్లు టాటా సన్స్ తాజాగా వాటాను పెంచుకున్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 1.8 మిలియన్ టాటా కెమికల్స్ షేర్లను టాటా సన్స్ కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ బల్క్ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీ 0.71 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 420.92 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 76 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో టాటా కెమికల్స్ షేరు తొలుత ఎన్ఎస్‌ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 465కు చేరింది. ప్రస్తుతం 6.7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 42 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!
రిలయన్స్ క్యాపిటల్
అనిల్ అంబానీ గ్రూప్ ఎన్‌బీఎఫ్‌సీ.. రిలయన్స్ క్యాపిటల్‌ను కొనుగోలు చేసేందుకు విదేశీ పీఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆస్తుల పునర్‌నిర్మాణ కంపెనీ(ఏఆర్‌సీ)లు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రుణ చెల్లింపులలో విఫలంకావడం ద్వారా రుణ పరిష్కార(రిజల్యూషన్) స్థితికి చేరిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి బ్లాక్‌స్టోన్ గ్రూప్, ఓక్‌టీ క్యాపిటల్, కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, జేసీ ఫ్లవర్ తదితర పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈవోఐను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయానికి(మానిటైజేషన్) డిబెంచర్ హోల్డర్స్ కమిటీతోపాటు.. డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వీటికి కంపెనీ రుణాలలో 93 శాతం వరకూ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్ సర్క‍్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 9.50 వద్ద ఫ్రీజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment