
న్యూఢిల్లీ: వ్యక్తిగత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం ముసాయిదా నిబంధనలను నెలరోజుల్లోనే విడుదల చేస్తామని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రభుత్వం తొలుత డిజిటల్‌గా ఈ చట్టం అమలుపై దృష్టి పెట్టినట్టు.. అందుకు అనుగుణంగా నిబంధనలు రూపొందించినట్టు చెప్పారు.
‘‘కార్యాచరణ సిద్ధమైంది. సంప్రదింపుల కోసం ముసాయిదా నిబంధనలను నెల రోజుల్లోపు ప్రజల ముందు ఉంచుతాం’’ అని మీడియా ప్రతినిధులకు వైష్ణవ్ తెలిపారు. నిబంధనలకు సంబంధించి భాష సరళతరంగా ఉంటుందన్నారు. గోప్యత హక్కు అన్నది ప్రాథమిక హక్కుల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరేళ్ల తర్వాత.. 2023 ఆగస్ట్ 9న ‘ద డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు’కు పార్లమెంట్ ఆమోదం తెలపడం గమనార్హం.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు యూజర్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగాన్ని ఈ చట్టం అడ్డుకుంటుంది. వ్యక్తిగత డేటా సేకరణ, ప్రాసెసింగ్‌కు సంబంధించి నిబంధనలను కచ్చితగా అమలు చేయాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన చోటుచేసుకుంటే రూ.250 కోట్ల వరకు జరిమాన చెల్లించే నిబంధన సైతం ఈ చట్టంలో భాగంగా ఉంది.