ముంబై: మహమ్మారి దెబ్బతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సెమీకండక్టర్ల సరఫరా సమస్య తాజాగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం వల్ల మరింత తీవ్రం కానుంది. చిప్‌ల తయారీకి అవసరమైన కీలక ముడి ఉత్పత్తుల్లో సింహభాగం వాటా ఈ రెండు దేశాల నియంత్రణలో ఉండటమే ఇందుకు కారణం. సెమీకండక్టర్ల తయారీలో పల్లాడియం, నియాన్ కీలకమైన ముడి ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా పల్లాడియం సరఫరాలో 44 శాతం వాటా రష్యాదే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే నియాన్ .. 70 శాతం భాగం ఉక్రెయిన్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే అంతర్జాతీయంగా చిప్‌ల కొరత మరింత పెరగవచ్చని మూడీస్ అనలిటిక్స్ ఒక నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్ చిప్‌లను మొబైల్ ఫోన్స్ మొదలుకుని వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తదితర ఉత్పత్తులన్నింటిలోనూ విరివిగా వాడతారు.
రేట్లు రయ్..
2014–15లో రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు నియాన్ ధరలు అనేక రెట్లు పెరిగిపోయాయి. యుద్ధం అంటూ వస్తే సెమీకండక్టర్ల పరిశ్రమకు ఎలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు అన్నది అప్పుడే వెల్లడైంది. 2015 తర్వాత నుంచి చిప్‌ల తయారీ కంపెనీలు నిల్వలను గణనీయంగా పెంచుకున్నప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి సమయంలో డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కొరత ఏర్పడింది. ఇక గోరుచుట్టుపై రోకటిపోటులాగా యుద్ధం కూడా వచ్చి పడటంతో.. ఉద్రిక్త పరిస్థితులు సత్వరం చక్కబడకపోతే వాహనాల తయారీ సంస్థలు, ఎల్రక్టానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు మొదలైన పరిశ్రమలన్నింటిపైనా తీవ్ర ప్రభావం పడొచ్చని నివేదిక హెచ్చరించింది.
ఎగియనున్న ద్రవ్యోల్బణం ..
క్రూడాయిల్ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కూడా ఎగియనుంది. అమెరికా తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఉక్రెయిన్‌లపై నేరుగా ఆధారపడకపోయినా రష్యన్ ఇంధనాన్ని ఉపయోగించే పలు యూరప్, ఆసియా దేశాల సంస్థల నుంచి అనేక ఉత్పత్తులు, సర్వీసులను దిగుమతి చేసుకుంటోంది. ఆ రకంగా పరోక్షంగా రష్యన్ ఇంధన కొరత సెగ అమెరికాకు కూడా తగిలే అవకాశం ఉంది. ఇంధనాల ధరలు ఎగియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంపై గణనీయంగా ప్రభావం పడనుంది. యుద్ధం రావడానికి ముందే .. మహమ్మారి విజృంభించిన సమయంలోనే 2021లో షిప్పింగ్ వ్యయాలు ఏకంగా 300 శాతం పెరిగిపోయాయి. చాలా మటుకు సరిహద్దులు, పోర్టులను మూసివేయడం వల్ల పలు పోర్టుల్లో కంటైనర్లు చిక్కుబడిపోవడం ఇందుకు కారణం. దీంతో అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు తూర్పు, పశ్చిమ దేశాల మధ్య అత్యంత లాభదాయక రూట్లపైనే దృష్టి పెడుతున్నాయి. గతేడాది ఆఖరు నుంచి షిప్పింగ్ వ్యయాలు.. గరిష్ట స్థాయి నుంచి కాస్త దిగి వచ్చినప్పటికీ కొత్త కంటైనర్ల కొరత వల్ల ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ యుద్ధం వల్ల చాలా మటుకు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపోవచ్చని, ఫలితంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చని నివేదిక అభిప్రాయపడింది. దీనివల్ల వృద్ధి మందగించడంతో పాటు యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా కంపెనీలు, వినియోగదారులపై అధిక ధరలు.. వడ్డీ రేట్ల వల్ల ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది.
యూరప్ దేశాలకు చమురు సెగ..
ఇరు దేశాల మధ్య యుద్ధంతో చమురు ధరలు గణనీయంగా పెరిగిపోతాయని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది. ఒకవేళ రష్యా నుంచి సరఫరా పెరిగినప్పటికీ చమురును దిగుమతి చేసుకునే దేశాలపై ప్రతికూల ప్రభావం కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం చమురు ధర తొమ్మి దేళ్ల గరిష్టానికి ఎగబాకి, బ్యారెల్‌కు దాదాపు 111 డాలర్ల స్థాయిలో తిరుగాడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ఉత్పత్తిలో రష్యా వాటా 12%గా ఉంటుంది. సహజ వాయువు ఉత్పత్తిలో 17%, బొగ్గు 5.2%, జింక్ 15%, బంగారం 9.5%, పల్లాడియం 44%, ప్లాటినం ఉత్పత్తిలో 14% రష్యాకి ఉంది.
వీటిపై కూడా
చమురు కాకుండా అల్యుమినియం, గోధుమలు, నికెల్, వెండి మొదలైనవి కూడా ఉత్పత్తి చేస్తోంది. యూరప్ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఎక్కువగా రష్యాపైనే ఆధారపడుతుండటం వల్ల వాటిపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కరోనాతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఇప్పటికే బలహీనపడగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఇంధనాలపై ఆధారపడే చాలా మటుకు పరిశ్రమలు సమస్యలను ఎదుర్కొనాల్సి రానుంది.
చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్.. ఆదాయం, ఖర్చుల లెక్కలపై రోజువారీ పర్యవేక్షణ
పుతిన్.. నీకు అర్థమవుతుందా? సెమీకండక్టర్లకు యుద్ధం దెబ్బ
Published Sat, Mar 5 2022 8:52 AM | Last Updated on Sat, Mar 5 2022 12:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment