ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్‌సంగ్‌లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. కార్మికులు మొదటిసారి శుక్రవారం సమ్మె ప్రారంభించారు. సౌత్‌కొరియాలోని సియోల్‌లో ఉన్న శామ్‌సంగ్ ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.
శామ్‌సంగ్ కంపెనీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సమ్మెలు సాగలేదు. ఇదే మొదటిసారి. వేతనాల పెంపు, బోనస్‌లపై పలుసార్లు కంపెనీ యాజమాన్యంతో చర్చించామని సమ్మె నిర్వాహకులు చెప్పారు. కార్మికుల డిమాండ్లపై కంపెనీ స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా సౌత్‌కొరియా నేషన్‌వైడ్ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ లీ హ్యూన్ కుక్ మాట్లాడుతూ..‘కార్మికులు, కంపెనీకి మధ్య సంధానకర్తగా ఉన్న యూనియన్‌కు యాజమాన్యం విలువ ఇవ్వట్లేదు. కంపెనీలో ఉన్న ఐదు లేబర్ గ్రూపుల్లో యూనియన్ అతిపెద్దది. ఇందులో 28,000 మంది సభ్యులున్నారు. శామ్‌సంగ్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతుకు యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని దాదాపు 75 శాతం మంది ఏప్రిల్‌లో సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. వేతనాల పెంపు, బోనస్‌లపై కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించాం. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటు
యూనియన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి ఒకరు న్యూయార్క్ టైమ్స్‌తో తెలిపారు. చిప్ తయారీ మార్కెట్‌లో కంపెనీ ఏటా తన లక్ష్యాలను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కంపెనీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చిప్ విభాగం నుంచి కంపెనీకి సుమారు 1.4 బిలియన్ డాలర్ల(రూ.11వేలకోట్లు) లాభం చేకూరినట్లు నివేదికల ద్వారా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment