న్యూఢిల్లీ: వ్యాపార నిర్వహణలో కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి అధునాతన టెక్నాలజీల వినియోగాన్ని మరింతగా పెంచుకోవడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా నెక్ట్స్‌జెన్ డేటా వేర్‌హౌస్, డేటా లేక్‌ను వినియోగంలోకి తెచ్చింది. ఫిన్‌టెక్ సంస్థలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కలిసి రుణాలిచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ఎస్‌బీఐ ఈ విషయాలు వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళికరాజకీయపరమైన సవాళ్లు, చైనాలో కోవిడ్ మళ్లీ విజృంభించడం మొదలైన ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతీయ ఎకానమీ దీటుగా నిల్చిందని, తమ బ్యాంకు ఆర్థిక ఫలితాల్లో కూడా ఇది ప్రతిబింబించిందని ఎస్‌బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. తమ బ్యాంకు గత మూడేళ్లుగా వరుసగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తోందని ఆయన వివరించారు.
(ఇదీ చదవండి: భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..)
ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద గుర్తించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక విద్యుత్ తదితర కొత్త రంగాలకు రుణాలు కల్పించడం ద్వారా పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు ఖరా చెప్పారు. 2022–23లో ఎస్‌బీఐ నికర లాభం (స్టాండెలోన్) 58 శాతం పెరిగి రూ. 31,676 కోట్ల నుంచి రూ. 50,232 కోట్లకు ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment