సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు భారీ షాక్ ఇవ్వనుంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటుకు సిద్దమవుతోంది. తద్వారా ఎన్‌పీసీఐ గుత్తాధిపత్యానికి చెక్ చెప్పాలని భావిస్తోంది. అంతేకాదు ఇందులో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా భాగస్వామ్యం చేయనుందని తాజా సమాచారం. (ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా దినేష్ కుమార్)
దేశీయంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో ప్రాధమిక వాటాదారుగా ప్రవేశించే ప్రణాళికలను ఎస్‌బీఐ సిద్ధం చేసుకుంటోంది. దీనికి సంబంధించి మొదటి దశ చర్చలు పూర్తి చేసిందని, ఆర్‌బీఐ న్యూ అంబరిల్లా ఎంటిటీ(ఎన్ఈయూ) ఫ్రేమ్‌వర్క్ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అంశాన్ని పరిశీలిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తను ప్రధాన ప్రమోటర్ గా, ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులతో కన్సార్షియం ఏర్పాటుకు ఆహ్వానిస్తోంది. గత వారం ఆర్‌బీఐ విడుదల చేసిన నిబంధనల ప్రకారం, డిజిటల్ చెల్లింపులకు ఆమోదం పొందిన ఏ కొత్త గొడుగు సంస్థ అయినా ఎన్‌పీసీఐ తరహా అధికారాలను సొంతం చేసుకోవచ్చు. 500 కోట్ల రూపాయల నికర పెట్టుబడి అవసరం. ఇందుకు దరఖాస్తు సమర్పించడానికి జనవరి, 2021 గడువుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కొత్త వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. (ఎస్‌బీఐ లోన్ : అనిల్ అంబానీకి ఊరట)
కాగా ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఎ) సంయక్త ఆధ్వర్యంలో 2008లో ఎన్‌పీసీఐ ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా 60 శాతం చెల్లింపు లను వాల్యూమ్‌లను ఎన్‌పీసీఐ నియంత్రిస్తుంది. ఎస్బీఐ సహా, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ), తక్షణ చెల్లింపు సేవలు (ఐఎంపిఎస్), భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్) వంటి సేవలను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment