
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) బాండ్ల జారీ ద్వారా రూ.4,000 కోట్లు సమకూర్చుకుంది. బాసెల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్-1 బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ఏటీ-1 బాండ్లకు 7.72 శాతం కూపన్ రేటును ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ.1,000 కోట్ల బేస్‌తో జారీ చేసిన బాండ్లకు భారీ స్థాయిలో డిమాండ్ కనిపించినట్లు ఎస్‌బీఐ తెలియజేసింది. రూ.10,000 కోట్లకుపైగా విలువైన బిడ్స్ లభించినట్లు వెల్లడించింది.
దీంతో 7.72 శాతం కూపన్ రేటుతో రూ.4,000 కోట్ల విలువైన బిడ్స్‌ను అంగీకరించినట్లు వివరించింది. కాగా.. 2013లో బాసెల్-3 నిబంధనలు అమల్లోకి వచ్చాక ఏటీ-1 బాండ్లకు ఒక దేశీ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న అత్యంత కనిష్ట ధర ఇదని ఎస్‌బీఐ తెలియజేసింది. వీటికి రేటింగ్ సంస్థలు అత్యుత్తమ రేటింగ్ ఏఏప్లస్‌ను ప్రకటించినట్లు వెల్లడించింది. నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ.429 వద్ద ముగిసింది.(చదవండి: దాల్ సరస్సులో ఎస్‌బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్)