
న్యూఢిల్లీ: ఇన్నోవా క్యాప్‌టాబ్, బ్లూజెట్ హెల్త్‌కేర్ కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు సెబీ నుంచి ఆమోదం లభించింది. దీంతో ఈ రెండు సంస్థలు ఐపీవో రూపంలో ప్రజల నుంచి నిధులు సమీకరించుకునేందుకు మార్గం సుగమం అయింది. ఈ రెండు సంస్థలు గతేడాది జూన్–సెప్టెంబర్ మధ్య ఐపీవో అనుమతి కోరుతూ సెబీ వద్ద పత్రాలు దాఖలు చేశాయి. తాజాగా ఈ రెండింటి ఐపీవోలకు సెబీ అన అబ్జర్వేషన్ (అనుమతి) తెలియజేసింది. ఇన్నోవా క్యాప్‌టాబ్ తాజా ఈక్విటీ జారీ రూపంలో రూ.400 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది.
కంపెనీలో ఇప్పటికే వాటాలు కలిగిన ప్రమోటర్లు, ఇతర వాటాదారులు 96 లక్షల ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా విక్రయించనున్నారు. అంటే ఈ మొత్తం ఆయా వాటాదారులకే వెళుతుంది. తాజా షేర్ల జారీ రూపంలో వచ్చే నిధుల నుంచి రూ.180 కోట్లను కంపెనీ రుణాలు తీర్చివేసేందుకు వినియోగించనుంది. రూ.90 కోట్లను మూలధన అవసరాలకు ఉపయోగిస్తుంది. ఇన్నోవా క్యాప్‌టాబ్ ఫార్మా రంగంలో పరిశోధన, అభివృద్ధి, తయారీ, పంపిణీ, మార్కెటింగ్, ఎగుమతి సేవలను అందిస్తోంది. ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్‌ను తయారు చేసే బ్లూజెట్ హెల్త్ కేర్ ఐపీవోలో భాగంగా రూ.2,16,83,178 షేర్లను (ఓఎఫ్‌ఎస్) విక్రయించనుంది. ప్రమోటర్లు అక్షయ్ బన్సారిలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా తమ వాటాల నుంచి ఈ మేరకు విక్రయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment