న్యూఢిల్లీ: భారత్‌లో గోల్డ్ ఎక్సేంజీల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటు ప్రతిపాదనను గత ఏడాది సెప్టెంబర్‌లో సెబీ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గోల్డ్ ఎక్సేంజీల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్‌మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్‌లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సేంజీ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలు
- ఈజీఆర్‌ల సృష్టికి సంబంధించి డిపాజిట్ చేసిన బంగారం కోసం ఉద్దేశించిన వాల్టింగ్ సేవలను అందించడానికి సెబీ మధ్యవర్తిగా వాల్డ్ మేనేజర్ నమోదవుతారు. మేనేజర్‌పై సెబీ పూర్తిస్థాయి నియంత్రణ ఉంటుంది.
- పసిడి డిపాజిట్‌లను అంగీకరించడం, బంగారం నిల్వ, భద్రపరచడం, ఈజీఆర్‌ల రూపకల్పన–ఉపసంహరణ, ఫిర్యాదుల పరిష్కారం, డిపాజిటరీ రికార్డులతో భౌతిక బంగారాన్ని కాలానుగుణంగా సమన్వయం చేయడం వంటి అంశాలు వాల్ట్ మేనేజర్ బాధ్యతల్లో కొన్ని.
- వాల్ట్ మేనేజర్‌గా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలకునే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారై కనీస నెట్‌వర్త్ రూ.50 కోట్లు కలిగిఉండాలి.
- మంజూరు చేయబడిన ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను ‘నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో’ సస్పెండ్ చేసే రద్దు చేసే అధికారం సెబీకి ఉంటుంది.
- ఒక వాల్ట్ మేనేజర్ ఈ నిబంధనలలో నిర్దేశించిన గోల్డ్ ఎక్సేంజీ వ్యాపారంతోపాటు మరైదైనా కార్యకలాపాలను నిర్వహిస్తున్న పక్షంలో రెండు బిజినెస్ వ్యవహారాల పట్ల స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేక స్థలాలను సైతం తప్పనిసరిగా కేటాయించుకోవాలి.
- వాల్ట్ మేనేజర్‌లు వాల్టింగ్ సేవలకు సంబంధించిన అన్ని లావాదేవీలను ఎలక్ట్రానిక్ రూపంలో రికార్డ్ చేయడానికి తగిన వ్యవస్థ (సిస్టమ్)లను కలిగి ఉండాలి.
- బంగారం నిల్వ, బదిలీ, ఉపసంహరణ వివరాలు; డిపాజిట్ చేసిన బంగారం స్వచ్ఛత, పరిమాణం– బరువు, ఈజీఆర్‌ల సృష్టి, ట్రేడింగ్ వంటి అంశాలకు సంబంధించి పత్రాలను పారదర్శకంగా నిర్వహించాలి. ఆయా పత్రాలను కనీసం ఐదు సంవత్సరాలు వాల్డ్ మేనేజర్ భద్రపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెగ్యులేటర్ సెబీ నిర్దేశించిన నియమావళికి (కోడ్ ఆఫ్ కాండక్ట్) కట్టుబడి ఉండాలి.
- వాల్ట్‌లలో బంగారం డిపాజిట్లకు సంబంధించి, ఈజీఆర్‌లను సృష్టించాలనుకునే ఎవరైనా రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ వద్ద బంగారం డిపాజిట్ కోసం అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. బంగారం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించే అధికారం వాల్డ్ మేనేజర్‌కు ఉంటుంది. బంగారు కడ్డీలను తూకం వేయడం, బంగారం డిపాజిట్ సమయంలో అవసరమైన డాక్యుమెంటేషన్ వంటి కార్యకలాపాల నిర్వహణ మేనేజర్ విధివిధానంలో భాగం.
- వాల్ట్ మేనేజర్ లేదా ఆ సంస్థ తరపున అధికారం పొందిన వ్యక్తి ఎవరైనా.. గుర్తింపు పొందిన రిఫైనరీ లేదా నామినేటెడ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు నిర్ధారిస్తారు.
- ఈజీఆర్ సృష్టి, క్యాన్సిలేషన్‌కు సంబంధించి డిపాజిటరీతో ప్రతి వాల్ట్ మేనేజర్ లావాదేవీ నిర్వహిస్తుంది.
- డిపాజిటర్ నుండి బంగారాన్ని అంగీకరించిన తర్వాత, వాల్ట్ మేనేజర్ బెనిఫిషియల్ ఓనర్‌గా డిపాజిటర్ పేరు మీద ఈజీఆర్‌ను సృష్టిసారు. ఇందుకు అనుగుణంగా డాక్యుమెంటేషన్ జరుగుతుంది.
- బంగారం ఉపసంహరణకు సంబంధించి, వాల్ట్ నుండి బంగారాన్ని విత్‌డ్రా చేయాలనుకునే బెనిఫిషియల్ ఓనర్ డిపాజిటరీకి ఈ మేరకు ఒక అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి మొదట ఛార్జీల బకాయిలను వాల్డ్ మేనేజర్‌కు చెల్లించాలి.
- వాల్ట్ మేనేజర్ ఖాతాలు, రికార్డులు, పత్రాలు, బంగారం డిపాజిట్ల పుస్తకాలను తనిఖీ చేసే హక్కు నియంత్రణా సంస్థ సెబీకి ఉంటుంది. సెక్యూరిటీ మార్కెట్ ప్రయోజనాలు, పారదర్శకత పరిరక్షణ సెబీ ప్రధాన ధ్యేయం. అయితే ఈ తరహా తనఖీకి 10 రోజుల ముందు వాల్డ్ మేనేజర్‌కు నోటీసు పంపడం జరుగుతుంది.
- సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వాల్ట్ మేనేజర్స్ రూల్స్ పేరుతో జారీ అయిన కొత్త నిబంధనావళి డిసెంబర్ 31 నుండి అమలులోకి వచ్చింది.
గోల్డ్ ఎక్సేంజీ, వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్‌ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021–22 బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గోల్డ్ ఎక్సేంజీ కోసం సెబీ నియంత్రకంగా ఉంటుందని మరియు కమోడిటీ మార్కెట్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బలోపేతం అవుతుందని చెప్పారు. కమోడిటీ మార్కెట్ పటిష్టత, పాదర్శకతలను పెంపొందించడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment