ఇల్లు అమ్మి కొత్తగా మరో ఇల్లు కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల్లో మాత్రం తేడాలున్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 54, సెక్షన్ 54ఎఫ్‌లో ఈ విషయాలను పొందుపరిచారు. అవి ఏమిటో తెలుసుకుందాం.
1. మీకు ఉన్న పాత ఇల్లు అమ్మి తదనుగుణంగా సక్రమించే మూలధన లాభాలతో మరో కొత్త ఇల్లు కొనుగోలు చేసినప్పుడు సెక్షన్ 54 వర్తిస్తుంది. అంటే ఇల్లు అమ్మి, ఇల్లు కొనడం అన్నమాట. 54ఎఫ్ సెక్షన్ ప్రకారం మీ ఇల్లు అమ్మితే ఎటువంటి ప్రయోజనం రాదు. మీరు అమ్మే క్యాపిటల్ అసెట్ ఇల్లు తప్ప మిగిలింది ఏదైనా కావాలి. అంటే స్థలం, షేర్లు, బంగారం మొదలైనవి. 54ఎఫ్ ప్రయోజనం పొందాలంటే ఇల్లు అమ్మకుండా ఇతర ఆస్తుల అమ్మకంతో ఏర్పడ్డ లాభాలతో ఇల్లు కొనాలి.
2. సెక్షన్ 54 ప్రకారం కేవలం మూలధన లాభాలు పెట్టి కొత్త ఇల్లు కొంటే మినహాయింపు దొరుకుతుంది. ఉదాహరణకు మీరు రూ.40 లక్షలు పెట్టి కొన్న ఇల్లు రూ.90 లక్షలకు అమ్మగా ఏర్పడ్డ లాభం రూ.50 లక్షలు. ఈ రూ.50 లక్షలతో కొత్త ఇల్లు కొంటే సరిపోతుంది. కానీ 54ఎఫ్ ప్రకారం మీకు చేతికొచ్చిన మొత్తం ప్రతిఫలంతో కొనాలి. ఉదాహరణకు బంగారం రూ.40 లక్షలకు కొని రూ.1 కోటికి అమ్మారు.. ఇప్పుడు లాభంతో నిమిత్తం లేకుండా మొత్తం ప్రతిఫలం వెచ్చించి ఇల్లు కొనాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో ముడిపడి ఉంది. 54లో కన్నా 54ఎఫ్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. బైటకు పోయే మొత్తం ఎక్కువ.
3. 54 ప్రకారం కొనే ఇంటి మీద ఎటువంటి ఆర్థిక ఆంక్షలు లేవు. ఎంత మొత్తం అయినా ఖర్చు పెట్టొచ్చు. మీకు సంక్రమించే ఆదాయాలు నిబంధనల ప్రకారం ఉండాలి. 54ఎఫ్ ప్రకారం కొత్త ఇల్లు ధర రూ.10 కోట్లు దాటకూడదు. పది కోట్లు దాటితే మొత్తం మీద పన్ను మినహాయింపు ఇవ్వరు.
4. ఇల్లు కొనే నాటికి మీకు ఇల్లు ఉండకూడదు. 54ఎఫ్ కేవలం ఇల్లు కొనడానికే ప్రోత్సాహకంగా పెట్టారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి ఇల్లు కొనేవారికే అనుకూలించేలా పెట్టారు. 54 ప్రకారం ఎటువంటి పరిమితులు, ఆంక్షలు లేవు. అన్ని రూల్స్ ఫాలో అయితే ఇల్లు కొనడం–అమ్మడంలో లబ్ధి పొందవచ్చు.
5. 54ఎఫ్ ప్రకారం ఆస్తి అమ్మిన తేదీ నుంచి ఏడాది ముందు, అలాగే రెండు సంవత్సరాల్లోపల కొనుక్కోవచ్చు. లేదా అమ్మిన తేదీ నుంచి 3 సంవత్సరాల్లోపల కొనుగోలు చేసుకోవచ్చు. 54లో ఇటువంటి ఆంక్షలు లేవు.
ఇదీ చదవండి: ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది మెరుగు?
ఈ రెండు సెక్షన్లు వ్యక్తులకు, హిందూ ఉమ్మడి కుటుంబాలకు వర్తిస్తాయి. నిబంధనల మేరకు రెండింటికీ క్యాపిటల్ గెయిన్స్ అకౌంటు రేటు వర్తిస్తుంది. సకాలంలో స్థలం కొని ఇల్లు కట్టుకున్నా ప్రయోజనం ఉంటుంది. అయితే, సెక్షన్ 54 ప్రయోజనం, 54ఎఫ్ ప్రయోజనం పరస్పరం ప్రత్యేకమైనవని గుర్తుంచుకోవాలి. కానీ 54ఎఫ్ ప్రయోజనం.. 54 ప్రయోజనాన్ని ప్రభావితం చేస్తుంది. 54 ప్రకారం ఇల్లు అమ్మితే ఇల్లు కొనుక్కోవచ్చు. బాండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. రెండింటిలోనూ వెచ్చించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకునేపుడు వృత్తి నిపుణుల సహాయం తీసుకోవడం మేలు.
-మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment