ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు మరోసారి మన మార్కెట్‌ను ముంచేశాయి. ఆరున్నర గంటల పాటు అమ్మకాల పరంపరం కొనసాగడంతో సూచీలు గడిచిన తొమ్మిది నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. అధిక వెయిటేజీ కలిగిన ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున విక్రయాలు వెల్లువెత్తడం సూచీలు భారీ క్షీణతకు దారితీసింది. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,939 పాయింట్ల నష్టంతో 49,100 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 568 పాయింట్లు కోల్పోయి 14,529 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,149 పాయింట్ల మేర నష్టపోయి 48,890 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 630 పాయింట్ల పతనమై 14,467 వద్దకు దిగజారింది.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సూచీలతో పాటు ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ సూచీలు 5% పతనమయ్యాయి. మెటల్, ఫార్మా, ఐటీ, ఆటో ఇండెక్స్‌లు 3% పతనయ్యాయి.
‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో వడ్డీరేట్ల పెరుగుదల భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రూపాయి భారీ పతనం ప్రతికూలాంశాలుగా మారాయి. దేశీయ మార్కెట్‌ను రానున్న రోజుల్లో క్యూ3 జీడీపీ గణాంకాలు కొంతకాలం ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలం పాటు మన మార్కెట్ అంతర్జాతీయ పరిణామాలనే అనుసరిస్తుంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
మార్కెట్‌లో మరిన్ని అంశాలు...
► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లు, నిఫ్టీలోని 50 షేర్లలో ఏ ఒక్క షేరూ లాభంతో ముగియలేదు.
► మార్కెట్లో ఒడుదొడుకుల్ని సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 19 శాతం నుంచి ఏకంగా 27 శాతానికి ఎగబాకింది.
► క్రూడాయిల్ ధర కాస్త దిగిరావడంతో ఓఎన్‌జీసీ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా షేరు ఎనిమిది శాతం పతనంతో రూ.111 వద్ద ముగిసింది.
► హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేరు 4 నుంచి 5 శాతం పతనయ్యాయి.
నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టం
సూచీలు మూడు శాతానికి పైగా పతనంతో ఇన్వెస్టర్లు 5.43 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ప్రతి నిమిషానికి రూ.1,450 కోట్ల నష్టాన్ని చూవిచూశారు. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.200 లక్షల కోట్లకు దిగివచ్చింది.
పతనానికి కారణాలు...
► భయపెట్టిన బాండ్ ఈల్డ్స్ ...
కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే వేగంగా పుంజుకుంటోంది. వ్యవస్థ ఊహించని రీతిలో వృద్ధి బాట పట్టడంతో రానున్న రోజుల్లో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తిరిగి వడ్డీరేట్లను పెంచవచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఈక్విటీలతో పోలిస్తే బాండ్లలో పెట్టుబడులకు రిస్క్ సామర్థ్యం చాలా తక్కువ. పైగా వడ్డీరేట్ల పెంపుతో బాండ్ల నుంచి అధిక ఆదాయాన్ని పొందవచ్చని ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఈక్విటీల నుంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.
► మళ్లీ పెరుగుతున్న కోవిడ్–19 కేసులు
ఒకపక్క దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనూ తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు మార్కెట్ వర్గాలను భయపెట్టాయి. దేశంలో గురువారం ఒక్కరోజే 15వేల కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పెరుగుతున్న కేసుల నియంత్రించే చర్యల్లో భాగంగా స్థానిక ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన లాక్‌డౌన్ చర్యలు ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఆంటంకాన్ని కలిగించవచ్చనే ఆందోళనలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి.
► లాభాల స్వీకరణ.. అప్రమత్తత!
అంతకుముందు సూచీలు మూడురోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ గడిచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 1295 పాయింట్లు, నిఫ్టీ 421 పాయింట్లను ఆర్జించాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అలాగే మార్కెట్ ముగింపు తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ3 జీడీపీ గణాంకాలు విడుదల కానుండటంతో ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.
► ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు...
పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య రాజుకున్న ఘర్షణలు కూడా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అమెరికా మార్కెట్లు గురువారం రాత్రి రెండు శాతం నష్టంతో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లపై పడటంతో శుక్రవారం ఆసియాలో ప్రధాన దేశాలైన జపాన్, చైనా, సింగపూర్, కొరియా, తైవాన్ దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు 2–3 % శాతం నష్టాన్ని చవిచూశాయి.
► రూపాయి భారీ పతనం
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ కుప్పకూలింది. గత 19 నెలల్లోలేని విధంగా 104 పైసలు కోల్పోయింది. 73.47 వద్ద ముగిసింది.
మార్కెట్‌ను ముంచేసిన అంతర్జాతీయ అస్థిరతలు
Published Sat, Feb 27 2021 4:29 AM | Last Updated on Sat, Feb 27 2021 9:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment