ముంబై: గడిచిన రెండురోజుల పాటు నష్టాల బాటలో నడిచిన బుల్స్.., ఆర్థిక, బ్యాంకింగ్ రంగ షేర్ల ర్యాలీతో శుక్రవారం మళ్లీ లాభాల గాడిలో పడ్డాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ మార్చి క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. కోవిడ్ సంక్షోభంలో కేంద్ర ఆర్థిక అవసరాలకు ఆర్‌బీఐ రూ.99,122 కోట్ల మిగులు నిధులను డివిడెంట్ రూపంలో చెల్లించేందుకు ముందుకు రావడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. వీటికి తోడు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలమైన రికవరీ, దేశంలో కరోనా రోజూవారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం తదితర అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి.
ఫలితంగా అన్ని రంగాల షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు మార్చి 30 తేది తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి. సెన్సెక్స్ 976 పాయింట్లు లాభపడి తిరిగి 50వేల స్థాయి పైన 50,540 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269 పాయింట్లు పెరిగి 15 వేల స్థాయి ఎగువున 15,175 వద్ద నిలిచింది. మార్కెట్ భారీ ర్యాలీతో సూచీలు గడిచిన రెండు రోజుల్లో కోల్పోయిన లాభాలన్నీ రికవరీ అయ్యాయి. ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలు వెల్లడించడంతో అధిక వెయిటేజీ బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 65 డాలర్లకు దిగిరావడం హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మాత్రమే నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1026 పాయింట్లు, నిఫ్టీ 284 పాయింట్ల మేర లాభపడ్డాయి.
విదేశీ ఇన్వెస్టర్లు రూ.510.16 కోట్లను ఈక్విటీ షేర్లను, సంస్థాగత పెట్టుబడిదారులు రూ.649 కోట్ల షేర్లను కొన్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కారణంగా లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించవచ్చనే ఆశలతో పాటు వ్యాక్సినేషన్ వేగవంతం, కార్పొరేట్లు ఆశాజనక మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటనతో ఈ వారంలో సెన్సెక్స్ 1,808 పాయింట్లు, నిఫ్టీ 498 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘వ్యాక్సినేషన్ వేగవంతంతో కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయాలు వృద్ధి చెందవచ్చనే ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఇటీవల ఆర్‌బీఐ ఉద్దీపన చర్యల ప్రకటనకు తోడు తాజాగా కేంద్రానికి మిగులు నిధుల మళ్లింపు అంశాలు బుల్స్‌కు జోష్‌నిచ్చాయి. రానున్న రోజుల్లో నిఫ్టీ 15,050 స్థాయిని నిలుపుకుంటే 15,300 స్థాయికి చేరుకోగలదు. ర్యాలీ కొనసాగితే ఆల్‌టైం 15,431 స్థాయిని సైతం అందుకోవచ్చు. ఒకవేళ లాభాల స్వీకరణ లేదా మరేఇతరేత వల్ల మార్కెట్ పతనం జరిగితే దిగువ స్థాయిలో 15,000 వద్ద మద్దతు స్థాయిని కలిగి ఉంది’’ ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెచ్ ఎస్ రంగనాథన్ తెలిపారు.
ఆల్‌టైం హైకి బీఎస్‌ఈ మార్కెట్ క్యాప్...
సూచీలు దాదాపు రెండు శాతం ర్యాలీ చేయడంతో ఒక్కరోజులోనే రూ.2.41 లక్షల కోట్ల సంపద ఇన్వెస్టర్ల సొంతమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం తొలిసారి 3 ట్రిలియన్ డాలర్లను (రూ.218 లక్షల కోట్లు) తాకింది. కంపెనీల మార్కెట్ క్యాప్‌నకు సంబంధించి ఇది సరికొత్త రికార్డు అని బీఎస్‌ఈ గణాంకాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment