న్యూఢిల్లీ: ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్ల అండతో స్టాక్ సూచీలు శుక్రవారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలపడటమూ కలిసొచ్చింది. ఐటీతో పాటు అధిక వెయిటేజీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన షేర్లు, అలాగే సర్వీసెస్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, వినిమయ షేర్లు రాణించి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 21,895 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం.
విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్ సూచీలు 0.41%, 0.36% లాభపడ్డాయి. రికార్డుల ర్యాలీలోనూ ఫార్మా, ఆటో, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ, ఉపాధి కల్పన అంచనాలకు మించిన నమోదు కారణంగా ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.\
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలను విస్మరిస్తూ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 72,148 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 21,774 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉత్సాహంగా మొదలైన సూచీలు రోజంతా అదే రోజు కనబరిచాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగసి 72,721 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు బలపడి 21,928 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి.
♦ సెన్సెక్స్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4 సెషన్లలో రూ.6.88 లక్షల కోట్లు పెరిగి ఆల్ టైం హై రూ.373.29 లక్షల కోట్లకు చేరింది.
♦ఐటీ రంగ షేర్లు 8% ర్యాలీ చేసి సూచీలను సరికొత్త శిఖరాల వైపు నడిపించాయి.
♦దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌ల క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ పెంచింది.
♦కోఫోర్జ్ 6%, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, ఎల్‌టీఐఎం షేర్లు 5%, విప్రో, ఎంఫసీస్‌లు 4%, పెర్సిస్టెంట్ 3.50%, ఎల్‌టీటీఎస్ 2% లాభపడ్డాయి.
♦ అంచనాలకు తగ్గట్టు డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు ప్రకటిచడంతో ఇన్ఫోసిస్ షేరు 8% ఎగసి రూ.1612 వద్ద ముగిసింది.
♦ ఇదే క్యూ3లో మెరుగైన పనితీరుతో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించిన టీసీఎస్ షేరు 4% లాభపడి రూ.3,882 వద్ద స్థిరపడింది.
♦ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%, యూనియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్‌లు 5%, పీఎస్‌బీ, యూకో బ్యాంక్, పీఎస్‌బీ, సెంట్రల్ బ్యాంక్‌లు 3% పెరిగాయి. ఎస్‌బీఐ, ఐఓబీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ షేర్లు 2–1% మధ్య లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment