
నేడు (26న) వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 26 పాయింట్లు బలపడి 11,498 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్ నెల ఫ్యూచర్స్ 11,472 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజాల అండతో వరుసగా మూడో రోజు మంగళవారం యూఎస్ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త రికార్డుల వద్ద ముగిశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. దేశీయంగా జీడీపీ గణాంకాలు వెల్లడికానుండగా... గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు కారణంగా మార్కెట్లలో కొంతమేర ఆటుపోట్లు కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
స్వల్ప లాభాలతో సరి
మంగళవారం హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు పుంజుకుని 38,844 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. అయితే తొలి సెషన్‌లో సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి 38,680 దిగువన కనిష్టానికి చేరింది. మరోవైపు నిఫ్టీ ఇంట్రాడేలో 11,526 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,423 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. .
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,422 పాయింట్ల వద్ద, తదుపరి 11,372 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,524 పాయింట్ల వద్ద, ఆపై 11,576 వద్ద నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,907 పాయింట్ల వద్ద, తదుపరి 22,721 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,229 పాయింట్ల వద్ద, తదుపరి 23,366 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,481 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 173 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 219 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు దాదాపు రూ. 336 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.