తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి యధాప్రకారం ఆటుపోట్లకు లోనయ్యాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు క్షీణించి 38,991 వద్ద నిలవగా.. నిఫ్టీ 8 పాయింట్లు తక్కువగా 11,527 వద్ద స్థిరపడింది. బుధవారం అమెరికా ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకోగా.. దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. అయితే చైనాతో సైనిక వివాదాల నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 39,236- 38,943 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 11,585 వద్ద గరిష్టాన్ని తాకగా.. 11,508 దిగువన కనిష్టానికి చేరింది.
ఇన్‌ఫ్రాటెల్ జూమ్
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.5-0.8 శాతం మధ్య పుంజుకోగా.. బ్యాంకింగ్, మెటల్ 1.5-0.6 శాతం బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్ 11 శాతం దూసుకెళ్లగా.. గ్రాసిమ్, టైటన్, యూపీఎల్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్లే, ఐషర్, మారుతీ, అదానీ పోర్ట్స్ ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గెయల్, బజాజ్ ఆటో, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్ 7-0.7 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్, హిందాల్కో, పవర్‌గ్రిడ్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, బ్రిటానియా, ఇండస్‌ఇండ్, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్ 2-0.7 శాతం మధ్య డీలాపడ్దాయి.
ఐడియా హైజంప్
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఐడియా 30 శాతం దూసుకెళ్లగా.. యూబీఎల్, టాటా కన్జూమర్, బయోకాన్, బాటా, మ్యాక్స్ ఫైనాన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, హావెల్స్, పిడిలైట్, వోల్టాస్, భెల్, ఇండిగో, ఎస్‌ఆర్‌ఎఫ్, గోద్రెజ్ సీపీ, జూబిలెంట్ ఫుడ్, ఐజీఎల్ 7.5-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మరోపక్క పేజ్, ఐబీ హౌసింగ్, వేదాంతా, ఆర్‌బీఎల్, దివీస్, భారత్ ఫోర్జ్, నౌకరీ, జీఎంఆర్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1481 లాభపడగా.. 1204 నష్టాలతో ముగిశాయి.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 991 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 657 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 486 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 775 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3,395 కోట్లకుపైగా అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 681 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment