
ముంబై: వినియోగదారులకు జనవరి 11వ తేదీన మరో గోల్డ్ బాండ్ స్కీమ్ అందుబాటులోకి రానుంది. జనవరి 15వ తేదీ వరకూ ఇది అమల్లో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020–21 సిరిస్‌లో ఇది పదవదికాగా, ఇప్పటికే తొమ్మిది పూర్తయ్యాయి. తాజా ఇష్యూలో గ్రాము ధర రూ.5,104 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం వెలువరించిన ఒక ప్రకటన తెలిపింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేసిన వారికి గ్రాము బాండ్‌పై రూ.50 తగ్గింపు లభిస్తుంది. అంటే గ్రాము ధర రూ.5,054కే లభిస్తుందన్నమాట.
గడచిన మూడు ఇష్యూ ధరలు ఇవీ...
2020 డిసెంబర్ 28 నుంచి జనవరి 1వ వరకూ అందుబాటులో ఉన్న తొమ్మిదవ సిరీస్ బాండ్ ఇష్యూ ధర కన్నా తాజా ధర రూ.104 అధికంగా ఉండడం గమనార్హం.
నవంబర్ 9 నుంచి 13 వరకూ అందుబాటులో ఉన్న ఎనిమిదవ గోల్డ్ బాండ్ స్కీమ్ ధర రూ.5,177.
అక్టోబర్ 12 నుంచి అక్టోబర్16 మధ్య జరిగిన ఏడవ విడత బాండ్ల జారీకి సంబంధించి పసిడి విలువ గ్రాముకు రూ.5,051గా ఉంది.
37 దఫాల్లో రూ.9,653 కోట్ల సమీకరణ
2019–20 ఆర్‌బీఐ నివేదిక ప్రకారం, 2015 నవంబర్ నుంచి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా (37 దఫాలు) రూ.9,652.78 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమీకరించింది.