అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ గణాంకాలు మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం తీవ్ర ఒడుదొడుకులకు లోనైన మార్కెట్లు ఈ వారం కూడా అదే రీతిలో ఉన్నా కాస్తా నెమ్మదించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి వారం గడిచినప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న అనిశ్చితి ప్రతికూల సంకేతాలను పంపిస్తోంది. విదేశీ మదుపర్ల అమ్మకాలు పెరుగుతున్నందున మార్కెట్లో ఆటుపోట్లు తప్పవు.
జీడీపీ మందగమనం
గత వారం చివర్లో జీడీపీ గణాంకాలు వెలువడ్డాయి. ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఈ గణాంకాలు నమోదు కావడం మార్కెట్‌ను నిరుత్సాహపరుచనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి కేవలం 5.4 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 8.1 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. అలాగే మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నమోదైన వృద్ధి రేటు 6.7 శాతంతో పోల్చి చూసినా తక్కువే. ముఖ్యంగా తయారీ రంగంలో వృద్ధి మందగించడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. ప్రస్తుత అంకెలు అంచనాలకు దూరంగా ఉండటం ఈవారం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తుంది. సోమవారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా ముగింపు వరకు కాస్తా కోలుకోవచ్చని అంచనా.
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగే అవకాశం..
అక్టోబర్ నెల ప్రారంభం నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) క్రమంగా మార్కెట్ నుంచి తమ పెట్టుబడిని ఉపసంహరిస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత నికర కొనుగోలుదార్లుగా నిలిచినప్పటికీ అది మూడు రోజులకే పరిమితమైంది. గత వారం చివరి రెండు రోజుల్లో ఏకంగా దాదాపు రూ.16000 కోట్ల షేర్లను అమ్మేశారు. ఎఫ్ఐఐలు ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరుపుతుండగా మరోపక్క దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) మాత్రం మార్కెట్‌కు తమ మద్దతు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఐఐల అమ్మకాలు డిసెంబర్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..
గత వారాంతాన అమెరికా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా అమెరికా విషయంలో ట్రంప్ నిర్ణయాలు మార్కెట్లకు కొత్త శక్తినిస్తూ రికార్డుల వైపు పరుగు తీయిస్తున్నాయి. డోజోన్స్, ఎస్ & పీ ఇండెక్స్‌లు దూసుకెళుతుండగా టెక్నాలజీ స్టాక్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. దీని ప్రభావంతో నాస్డాక్ సూచీ పడిపోయేందుకు కారణమవుతుంది. ఇది మన మార్కెట్లలో ఐటీ షేర్లను ప్రభావితం చేస్తోంది. ఈవారం కూడా అమెరికా మార్కెట్లు లాభాలను కొనసాగించే అవకాశం ఉన్నందుకు ఇది కొంతవరకు మన మార్కెట్లకు సానుకూల సంకేతాలను పంపొచ్చు.
ఇదీ చదవండి: ‘మీరు ముసలాడవ్వకూడదు’
సాంకేతిక స్థాయులు
సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడిదొడుకులు కొనసాగుతాయి. నిఫ్టీ గతవారం 24130 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఒక రకంగా అమ్మకాల స్థాయిని సూచిస్తోంది. సోమవారం నిఫ్టీ తొలి గంటలో 24150 స్థాయికి దిగువన ట్రేడ్ అయితే అమ్మకాల ఉద్ధృతి మరింత పెరుగుతుంది. ఇదే కొనసాగితే ఈవారం నిఫ్టీ 23800 మార్కును చేరవచ్చు. దాన్ని కూడా బ్రేక్ చేస్తే తదుపరి మద్దతు స్థాయి 23300కు పడిపోయే అవకాశం ఉంది.
- బెహరాశ్రీనివాసరావు
మార్కెట్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment