రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ (z plus security) భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం దేశంలోనే ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రత కల్పిస్తుందని తెలిపింది.
విదేశాలకు వెళ్లినప్పుడు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారికి భద్రతా ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. కోర్టు ఆదేశాలతో ముఖేష్ అంబానీ కుటుంబానికి భారత్‌తో పాటు ఇతర దేశాల్లో సైతం జెడ్ ప్లస్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహించే కమాండోలు వారికి రక్షణగా నిలవనున్నారు. అయితే అత్యంత ఖరీదైన జెడ్ ప్లస్ కేటగిరీకి అయ్యే ఖర్చు ముఖేష్ అంబానీయే భరించాలని సుప్రీం కోర్టు కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
జెడ్ ప్లస్ భద్రత ఎందుకు?
ఇటీవల కాలంలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. దీంతో భద్రత దృష్ట్యా కేంద్రం అంబానీలకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. అయితే వీరికి భద్రత కల్పించడంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ హైకోర్టుల్లో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో..ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు..ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికోసం అయ్యే ఖర్చులను అంబానీలే భరించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment