
Tarun Katial to launch women-only platform Eve World: విదేశాలతో పోలిస్తే.. మన దేశంలో మహిళలకు సంబంధించిన యాప్స్(ప్రైవేట్) చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన యాప్స్ వేళ్ల మీద లెక్కపెట్టేవిగా ఉన్నాయి. ఈ తరుణంలో మీడియా దిగ్గజం తరుణ్ కటియాల్ ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే రూపొందించాడు. అందుకు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది.. స్వయంగా ఆయన భార్యకి ఎదురైన అనుభమే!.
ఈవ్ వరల్డ్.. మహిళల భద్రత కోసం రూపొందించిన ప్లాట్‌ఫామ్. ఈ ప్రపంచంలోకి కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆడవాళ్లు తమ అనుభవాల్ని పంచుకోవడం, ఓదార్పు కోరుకోవడం, సలహాలు ఇచ్చుకోవడం, ఇతర సమస్యలపై చర్చించుకోవడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఒక స్పేస్ ఏర్పాటు చేయడం ద్వారా అసలు సమస్య పరిష్కారం అవుతుందా? వాళ్లకు ఉపశమనం దొరుకుతుందా? అనే ప్రశ్నలకు.. తరుణ్ కటియాల్ సమాధానమిస్తున్నారు.
‘‘మేం వాళ్ల(మహిళల) ప్రపంచాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు. కానీ, ఎంతో కొంత మంచి మాత్రం చేస్తాం. ఇదే మా ట్యాగ్ లైన్ కూడా అని చెప్తున్నారాయన. సమస్యకు పరిష్కారం చూపలేకపోయినా ఇంటర్నెట్‌లో, సంప్రదాయ సోషల్ మీడియా నెట్‌వర్క్స్‌లో ఎదుర్కొనే వేధింపుల గురించి మహిళలు బహిరంగంగా(పురుష సమాజంతో సంబంధం లేకుండా) చర్చించుకునేందుకు ఒక వేదికను అందిస్తున్నామని అంటున్నారాయన.
భారత్‌లో మహిళల మీద ఆన్‌లైన్ వేధింపులు పెరిగిపోయాయి. గతంలో ఫిర్యాదులు 300 వచ్చేవి. కరోనా టైం నుంచి ఆ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువైంది. - నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ
తరుణ్ కటియాల్ గతంలో బిగ్ ఎఫ్‌ఎం, జీ5కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. స్టార్ ఇండియా, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, రియలన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌లోనూ పని చేసిన అనుభవం ఉందాయనకు. ఆయన భార్య మోనిషా సింగ్ కటియాల్ కూడా మీడియా రంగంలోనే కొనసాగుతున్నారు. ఓసారి కొందరు వ్యక్తులు ఆమె నెంబర్ వాట్సాప్‌కి సందేశాలు పంపుతూ ట్రోల్ చేశారట. దీంతో పోలీసులను ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ, ‘ఫిర్యాదు చేసినా అతనిపై(నిందితుడి) ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి’ అంటూ భార్య చెప్పిన మాటలతో తరుణ్ కటియాల్ ఆలోచనలో పడ్డారట. అలా ఈవ్ వరల్డ్‌కు బీజం పడిందని చెప్తున్నారాయన. (క్లిక్: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!)
ఈవ్ వరల్డ్.. జూన్ 2021 నుంచి రియాలిటీలోకి వచ్చింది. ఇందులో మొదటి యూజర్‌గా చేరింది మోనిషా సింగ్ కటియాల్. మహిళా సాధికారికత సాధన ధ్యేయంగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్‌లో.. మహిళలు నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. కంటెంట్‌తో పాటు కమ్యూనిటీలను సైతం క్రియేట్ చేసుకోవచ్చు. పరిణామాలు, పర్యవసనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. పైగా ఈవ్ వరల్డ్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. అదనంగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని సైతం జత చేశారు. తద్వారా యూజర్ ప్రతీ చర్యకూ రివార్డులు దక్కుతుంటాయి. అవి పాయింట్లు, లేదంటే వర్చువల్ టోకెన్‌ల రూపంలో అందిస్తారు. వాటిని డాక్టర్ కన్సల్టింగ్ కోసం, మానసిక వైద్యులను సంప్రదించడం కోసం, షాపింగ్ లేదంటే ఎన్‌ఎఫ్‌టీలు కొనుగోలు చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. తద్వారా యూజర్‌తో పాటు ఈవ్ వరల్డ్‌కి ప్రమోషన్ ద్వారా ఆదాయమూ జనరేట్ అవుతుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!)
- సాక్షి, వెబ్ స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment