సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభం తాకిడితో.. పరస్పరం సహకరించుకునే విషయంలో యావత్ ప్రపంచం కొత్త శకం ముంగిట్లో నిల్చిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య నిరంతర సహకారం అందించిన ఉద్యోగులుఅందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షోభ సమయంలో ఉద్యోగుల సహకారాన్ని నమ్మకాన్ని ప్రశంసించడమే కాకుండా, మెడిసిన్, పట్టణ ప్రణాళిక, వాస్తుశిల్పం ఇలా లెక్కలేనన్ని అనేక ఇతర రంగాలలో మహమ్మారి పురోగతికి ప్రేరణనిచ్చిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
వ్యక్తులు, వ్యాపార సంస్థలు, దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి గట్టెక్కి, మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలంటే అంతర్జాతీయ సమాజమంతా కృషి చేస్తేనే సాధ్య పడుతుందని టాటా గ్రూప్‌లోని 7.5 లక్షలమంది ఉద్యోగులకు నూతన సంవత్సర సందేశంలో ఆయన తెలిపారు. కరోనా మహమ్మారితో నిబంధనలన్నీ సమూలంగా మారిపోయాయని.. భద్రతకు ప్రాధాన్యం మరింత పెరిగిందని పేర్కొన్నారు. ‘ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ టీకాలు పంపిణీ చేయడమనేది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం. వేగవంతమైన టెస్టింగ్, కొత్త చికిత్సలు కనుగొనడం కూడా ఇలాంటిదే. ప్రపంచమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే మళ్లీ సాధారణ స్థితికి రావడం సాధ్యపడుతుంది‘ అని చంద్రశేఖరన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment