ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినప్పటి నుంచి అక్కడి విదేశీ పౌరులతో సహ స్వదేశీ పౌరులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ నుంచి తరలి వెళ్తున్న ప్రజల కోసం టెస్లా ఉక్రెయిన్‌తో పాటు ఆ దేశం చుట్టూ ఉన్న అనేక దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచితంగా ఛార్జింగ్ సేవలను అందించడం ప్రారంభించింది. స్థానిక యజమానులకు పంపిన ఈమెయిల్‌లో టెస్లా & టెస్లా యేతర ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఛార్జింగ్ ఉపయోగించడానికి ఉక్రేనియన్ సరిహద్దులకు సమీపంలో అనేక సూపర్ ఛార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేయలని టెస్లా ప్రకటించింది.
సోమవారం నుంచి ఉక్రెయిన్‌లో ఇటీవల పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. క్షిపణి దాడులకు ప్రభావితమైన ప్రాంతాల్లో టెస్లా & నాన్-టెస్లా వాహనాలకు ఉచిత సూపర్ ఛార్జింగ్ సేవలను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ట్ర్జెబునోవిస్కో(పోలాండ్), కోసీఐస్(స్లోవేకియా), మిస్కోల్క్(హంగరీ), డెబ్రెసెన్ (హంగరీ) ప్రాంతాల్లో ఉచిత ఛార్జింగ్ సేవలు ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. "మీరు సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడానికి, మేము తీసుకున్న ఈ చర్య మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని ఆశిస్తున్నాము" అని కూడా అది తెలిపింది. టెస్లా ఇలా ఉచితంగా ఛార్జింగ్ సేవలు అందించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ప్రకృతి వైపరీత్యాలతో దక్షిణ అమెరికా ప్రాంతంలో హరికేన్ల సమయంలో అనేక సందర్భాల్లో యజమానులకు ఉచిత సూపర్ ఛార్జింగ్ సేవలను టెస్లా అందించింది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment