కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా చేసినట్లు తాజాగా ప్రకటించారు. అయితే ఆయన బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. భారతదేశంలో అత్యంత సంపన్న బ్యాంకర్ అయిన ఉదయ్ కోటక్ గురించిన పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం డిసెంబరులో పదవీ విరమణ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే పదవీ విరమణ రోజుకు నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 38 సంవత్సరాలకుపైగా ఉదయ్ కోటక్ ఈ పదవిలో కొనసాగారు.
ఇండియన్ రిచెస్ట్ బ్యాంకర్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. 2023 సెప్టెంబరు 2 నాటికి ఉదయ్ కోటక్ దాదాపు 13.7 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో భారతదేశపు అత్యంత సంపన్న బ్యాంకర్. ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆయన ఆదాయంలో దాదాపు 26 శాతం బ్యాంకులో వాటా నుంచే వస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఉదయ్ కోటక్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 133వ స్థానంలో ఉన్నారు.
కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరుతో 1985లో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003లో దాన్ని బ్యాంక్‌గా మార్చారు. ఉదయ్ కోటక్ కుమారుడు జే కోటక్.. కోటక్ 811 బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
ముంబయిలో పత్తి వ్యాపారం చేసే ఓ గుజరాతీ కుటుంబంలో ఉదయ్ కోటక్ జన్మించారు. 60 మంది సభ్యులున్న పెద్ద ఉమ్మడి కుటుంబం వారిది. సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బీకామ్ డిగ్రీని పొందారాయన. అలాగే జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఒకప్పుడు క్రికెటర్
రిచెస్ట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ గురించి అంతగా తెలియని విషయం ఏమిటంటే ఆయన అద్భుతమైన క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అలాగే కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. వాస్తవంగా క్రికెటర్‌గానే తన కెరీర్‌ను కొనసాగించాలకున్నారు ఉదయ్ కోటక్. కానీ విధి మరోలా తలచింది.
ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతున్న కంగా లీగ్‌లో వికెట్ల మధ్య పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు బాల్ ఆయన తలకు బలంగా తగిలింది. మెదడులో రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ చేశారు. ఈ ప్రమాదం ఆయన్ను కొన్ని నెలలపాటు మంచం పట్టించింది. క్రికెట్ కెరీర్‌ను ముగించడమే కాకుండా జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఒక విద్యా సంవత్సరం కూడా కోల్పోవాల్సి వచ్చింది.
(Warren Buffett Assets 2023: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి..)
ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత తన కుటుంబం, స్నేహితుల నుంచి కొంత పెట్టుబడి తీసుకుని ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించారు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉదయ్ కోటక్ ప్రాణ స్నేహితుడైన ఆనంద్ మహీంద్రా నుంచే వచ్చింది. తరువాత కొన్ని సంవత్సరాలలో ఉదయ్ కోటక్ తన ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఫైనాన్స్ వంటి వివిధ ఆర్థిక సేవల రంగాలలోకి విస్తరించారు.
Comments
Please login to add a commentAdd a comment