కొద్ది రోజులుగా కోవిడ్-19 కేసులు తిరిగి రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా నీరసించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీ(స్టిములస్)పై కాంగ్రెస్‌లో అనిశ్చితి కొనసాగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచింది. వెరసి సోమవారం యూఎస్ మార్కెట్లు గత నాలుగు వారాలలోనే అత్యధికంగా 2.3-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్ 650 పాయింట్లు(2.3 శాతం) క్షీణించి 27,685కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 64 పాయింట్లు(1.9 శాతం) నష్టంతో 3,401 వద్ద ముగిసింది. నాస్‌డాక్ సైతం 189 పాయింట్లు(1.65 శాతం) కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది.
ఎన్నికల్లోగా..
వచ్చే నెల మొదట్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీకంటే ఇది అధికంకాగా.. కొన్ని రాష్ట్రాలు, వర్గాలకు పెలోసీ అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ భారీ స్టిములస్‌కు తాను సిద్ధమేనంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి స్టీల్ ముచిన్‌తో పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు కొనసాగుతూనే ఉండటంతో సెంటిమెంటుకు దెబ్బతగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర లభించగలదని పెలోసీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల రోజువారీ కోవిడ్-19 కేసులు దాదాపు లక్షకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు వివరించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో తిరిగి కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో సోమవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 2-3 శాతం మధ్య నష్టపోయాయి.
నేలచూపులో..
ఈ వారంలో టెక్ దిగ్గజాలు, యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ తదితరాలు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం ప్రధానంగా ట్రావెల్ సంబంధ రంగాలు నీరసించాయి. ఎయిర్‌లైన్ కౌంటర్లలో యునైటెడ్, అమెరికన్, డెల్టా, సౌత్‌వెస్ట్ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. క్రూయిజర్ కంపెనీలలో రాయల్ కరిబియన్ 10 శాతం, కార్నికాల్ కార్ప్ 9 శాతం చొప్పున కుప్పకూలాయి. కోవిడ్-19 ప్రభావం అంచనాల కంటే అధికకాలం కొనసాగవచ్చని ప్రత్యర్థి కంపెనీ ఎస్‌ఏపీ తాజాగా పేర్కొనడంతో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్ప్ 4 శాతం బోర్లా పడింది. రికవరీ ఆలస్యం కారణంగా మధ్యకాలానికి లాభాల అంచనాలను తొలగిస్తున్నట్లు ఎస్‌ఏపీ పేర్కొంది. ఇదేవిధంగా త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హాస్‌బ్రో ఇంక్ 9.5 శాతం పడిపోయింది. అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, వీడియో కమ్యూనికేషన్ సేవల కంపెనీ జూమ్, వీడియో గేమ్స్ సంస్థ యాక్టివిజన్ బిజార్డ్ స్వల్ప లాభాలతో నిలదొక్కుకోవడం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment